Begin typing your search above and press return to search.

ఈనాడు రామోజీరావు ఆరోగ్యం విషమం.. పెద్ద ఫేక్ న్యూస్

By:  Tupaki Desk   |   24 Aug 2019 7:05 AM GMT
ఈనాడు రామోజీరావు ఆరోగ్యం విషమం.. పెద్ద ఫేక్ న్యూస్
X
సోషల్ మీడియా.. వాట్సాప్ పుణ్యమా అని ఒక అబద్ధం.. నిరాధారమైన విషయాలు కూడా వార్తలుగా మారటం.. ప్రముఖులకు తలనొప్పులుగా మారటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. సరిగ్గా.. రెండు రోజుల క్రితం ఒక సాయంత్రం వేళలో ఒక వాట్సాప్ మెసేజ్ విపరీతంగా వైరల్ గా మారింది.

దాని సారాంశం ఏమంటే.. ఈనాడు అధినేత రామోజీరావు ఆరోగ్యం విషమించింది. ఆయనకు వైద్య సాయం అందించేందుకు రామోజీ ఫిలిం సిటీలోనే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఫిలింసిటీని వదిలి వచ్చేందుకు రామోజీకి అంగీకరించకపోవటంతో.. ఫిలింసిటీలోనే ఆయనకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన అవసరాలకు తగ్గట్లుగా ఆయన ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిని తయారు చేశారంటూ ఒక పుకారు ఒళ్లు విరుచుకుంది.

అదిగో తోక అంటే.. ఇదిగో పులి అనే రోజులు కావటం.. గ్రౌండ్ వెళ్లి విషయాల్ని పరిశీలించటమో.. బలమైన సోర్సుతో మాత్రమే రిపోర్టింగ్ చేసే తీరును వదిలేసి.. వాట్సాప్ రిపోర్టింగ్ కు పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో రామోజీ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న వాట్సాప్ మెసేజ్ అనూహ్యంగా వైరల్ అయ్యింది. ఎక్కడ.. ఏ మీడియా గ్రూపులో చూసినా ఇదే వార్త.

దీంతో.. ఎవరికి వారు తమకు పరిచయం ఉన్న ఈనాడులోని ప్రముఖులను ఫోన్లు చేయటంతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అరే.. గంట క్రితం కూడా మాట్లాడాం. అప్పుడు లేని అనారోగ్యం.. మెసేజ్ రూపంలో వస్తుందా? అయినా ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసి చూస్తామని కనుక్కోవటం.. అక్కడి టాప్ ఆర్డర్ లో ఉన్న వారు చెడ తిట్లు తిట్టిపోయటం. ఎవడో పనికిమాలినోడు ప్రచారం చేస్తే.. ఇలా ఎంక్వయిరీలు చేయటమా? అంటూ ఫైర్ అయిన దాఖలాలు కూడా లేకపోలేదట. నిజమే.. మిగిలిన సంస్థలకు ఈనాడుకు తేడా ఏమిటంటే.. అక్కడ పని చేసే టాప్ ఆర్డర్ పెద్ద మనుషులు.. ఛైర్మన్ గారిని (రామోజీని అలానే పిలుస్తారు. మాట వరసకు పేరును ప్రస్తావించరు) తమ దైవంగా భావిస్తారు. అలాంటి వారే.. అక్కడ కీలక స్థానాల్లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి.

నిక్షేపంగా ఉన్న రామోజీని.. అనారోగ్యం పేరుతో ఆగమాగం చేస్తున్న వేళ.. ఇప్పుడు కొన్ని వెబ్ సైట్లు వార్తల్ని వండటం మొదలెట్టాయి. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వినిపించే కారుకూతలకు స్పందించి.. వివరణ ఇవ్వాలనటంలో ఏ మాత్రం అర్థం లేనిది. ఇవాళ.. రేపటి రోజున సోషల్ మీడియా చెలరేగిపోతున్న పరిస్థితుల్లో.. అందులో వచ్చే ప్రతి దానికి వివరణ ఇచ్చుకుంటూ పోతే అంతే ఉండదన్న ఈనాడు పెద్ద మనిషి మాటల్లో నిజాన్ని కాదనలేం.

ఏతావాతా చెప్పేదేమంటే.. ఈనాడు రామోజీరావు నిక్షేపంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన తన రోజువారీ పనులు ఆయనే చేసుకోవటమే కాదు.. నిత్యం ఉదయాన్నే ఐదు గంటల వేళలో తన ఎడిషన్లను చదువుతూ..పబ్లిష్ అయిన వార్తల మీద కామెంట్లను కూడా రాసేస్తున్నారు. సో.. రామోజీ ఆరోగ్యం మీద అనవసరమైన సందేహాలను తీసి పారేస్తే బెటర్.