Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను కరివేపాకులాగా వాడుకున్నబాబు - భూమన

By:  Tupaki Desk   |   23 May 2017 5:46 PM GMT
ఎన్టీఆర్ ను కరివేపాకులాగా వాడుకున్నబాబు - భూమన
X
హ‌త్యా రాజకీయాల‌కు తాను దూరం అని ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన‌ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఫ్యాక్షన్ లేకుండా చేస్తానన్నాడంటే దానర్థం ప్రతిపక్షం లేకుండా చేస్తాడనేనని అర్థమవుతోందని అన్నారు. కుల-మత- ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మంట రగిలించి ఆ మంటలో చలి కాచుకునే కుసంస్కారం చంద్రబాబుదని భూమన ఫైర్ అయ్యారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని కానీ దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఏనాడు ఫ్యాక్షన్ రాజకీయాలు నడపలేదని భూమన అన్నారు. ఒక‌వేళ వైఎస్ అలా చేసి ఉంటే బాబు రాజకీయాల్లో మనగలిగేవాడు కాదన్నారు. బాబు లాగ పిల్లనిచ్చిన మామకు వెన్నుపోడు పొడిచి, తోడల్లుడిని తొక్కేసి, బావమరిది హరికృష్ణను బయటకు రాకుండా చేసి, కుర్రాడు ఎన్టీఆర్ ను కరివేపాకులాగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదని భూమన విమర్శించారు. తన అధికారం కోసం సొంత కుటుంబంలోని అందరినీ సర్వనాశనం చేసి సరికొత్త ఫ్యాక్షన్ ను రంగంలోకి తెచ్చిన ఘనాపాటి దేశ చరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని భూమ‌న ఎద్దేవా చేశారు.

పథకం ప్రకారం ప్రభుత్వం కుట్రతో త‌మ పార్టీకి చెందిన నారాయణరెడ్డిని హత్య చేయించిందని భూమన ఆరోపించారు. ``తొమ్మిదిన్నరకు నారాయణరెడ్డి హత్య జ‌రిగితే మధ్యాహ్నం వరకు పోలీసులు రాలేదంటే వారి వైఫల్యం కాదా..? కల్వర్టు పనులను మూడ్రోజులుగా ఎందుకు నిలిపివేశారు? హత్యలో 25మంది యువకులు ఏవిధంగా పాల్గొన్నారు? మారణాయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను మటుమాయం చేస్తున్నావు? ` అంటూ మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా బాబు చ‌రిత్ర అంతా హ‌త్యారాజ‌కీయాలేన‌ని భూమ‌న మండిప‌డ్డారు. రాజారెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని భూమ‌న‌ దుయ్యబట్టారు. ఆ హంతకులను 30 రోజుల పాటు ముఖ్యమంత్రి నివాసంలోనే ఏర్పాటు చేశారని ఆనాడు మొత్తం మీడియా, ప్రతిపక్షాలు కోడై కూశాయని గుర్తు చేశారు. ``చంద్ర‌బాబు...రాజారెడ్డి హంతకుడివి నీవే. నీవు అధికారంలో ఉండగానే రాజారెడ్డి హత్యకు గుర‌య్యారు. వంగవీటి రంగాను హత్య చేయించింది బాబేనని ఆనాటి మంత్రివర్గంలో ఉన్న హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాశారు. ఆ రోజుల్లోనే ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు స్కూటర్ మీద వెళ్తుంటే విజయవాడలో బస్సుతో గుద్ది చంపించింది నీవు కాదా బాబు..?`` అని భూమ‌న‌ కడిగిపారేశారు.

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విష‌యంలో బాబు కుసంస్కారం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని భూమ‌న అన్నారు. ``అలిపిరిలో నీపై నక్సలైట్ల దాడి జరిగితే మా నాయకుడు వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా పరిగెంత్తుకుంటూ తిరుపతి వచ్చి సానుభూతి తెలపడమే గాకుండా భగవంతుని ఆశీస్సులతో ఏమీ జరగలేదు బాబు అని నిన్ను ఫ్లైట్ లో ఎక్కించి సాగనంపింది మర్చిపోయావా..? అలాంటి వైఎస్ఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఎన్ని మాటలన్నావ్. ఎంత నీచంగా మాట్లాడుతున్నావ్`` అని నిలదీశారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌న విష‌యంలో వాస్తవాలు చెప్పడానికి తాము ఎప్పుడు ముందుంటామ‌ని భూమ‌న స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజలకు నిజం చెప్పకుండా మానంగా ఉండబోమ‌ని భూమ‌న స్ప‌ష్టం చేశారు. a