బాబుది శల్యసారథ్యం..ఆయన నిప్పు-కత్తి నిజమే

Thu Apr 12 2018 16:42:14 GMT+0530 (IST)

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల ఆకాంక్షను సఫలం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయనతో పొత్తుపెట్టుకున్న బీజేపీ వమ్ము చేసిందని మండిపడ్డారు. ఇటు ప్రధాని మోడీ అటు సీఎం చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలోని అంశాలను - ప్రత్యేక హోదాను ఇస్తామని కేంద్రం చేసిన హామీని దగాగా మార్చిన నైజాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.బీజేపీ దీక్షలు ప్రజాస్వామ్యానికి చీడలాంటివని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అత్యున్నతమైన పదవిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త సమస్యలను సృష్టించడం ప్రజాస్వామ్యానికి తప్పుడు భాష్యం చెప్పడమేనని విమర్శించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ ను సజావుగా నడిపించడం లేదని ప్రధాని మోడీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని వైఎస్ ఆర్ సీపీ ఖండిస్తుందన్నారు. ఎవరైనా ఆందోళనలకు దిగితే.. ఆ ఆందోళనకు విరమింపజేసి సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. కొత్త సమస్యలు సృష్టించడం సమంజసం కాదన్నారు. దీక్షల పేరుతో బీజేపీ డ్రామాలాడుతుందన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చకు అవకాశం లేకుండా చేసి తన పెంపుడు బిడ్డలు లాంటి ఏఐడీఎంకే సభ్యులతో ఉద్దేశ్యపూర్వకంగా సభను స్తంభింపజేసిందన్నారు. సభలో హోదాపై చర్చ జరిగితే.. టీడీపీ - బీజేపీ - కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కారణమయ్యారో.. ఏయే హామీలు ఇచ్చి మోసం చేశారో.. అవన్నీ బట్టబయలు అయ్యేవని భూమన అన్నారు.

అమ్మను చంపి అనాథనని ఏడ్చినట్లుగా హోదా ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కి.. ఈ రోజున ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నేనే పైకెత్తుతున్నా.. అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని భూమన అన్నారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అనే మాటకు సమాధి కట్టేందుకు విశ్వప్రయత్నం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం హోదాకు ఆయనే హీరోగా తన ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని భూమన మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తామని యువతను భయబ్రాంతులకు గురి చేసి పోరాటం చేస్తున్న వైఎస్ ఆర్ సీపీ నేతలపై అనేక కేసులు పెట్టాడని విరుచుకుపడ్డారు. `40 సంవత్సరాలుగా నిప్పులా బతికాను.. కత్తిలాంటి వాడిని.. నాకంటే సీనియర్ నేతలు దేశంలో ఎవరూ లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నిజంగా చంద్రబాబు కత్తే అది ఎలాంటి కత్తి అంటే.. తన సొంత మామను వెన్నుపోటు పొడిచిన కత్తి.. తన సొంత బావను రాజకీయంగా సమాధి కట్టిన కత్తి.. ఆంధ్ర ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేయడానికి విసిరిన కత్తి లాంటి వాడు. చంద్రబాబు నిజంగా నిప్పే.. పత్తిబేళ్లు - పూరి గుడిసెలను - అమాయక ప్రజలను జీవితాలను బుగ్గిచేయడానికి వాడే నిప్పు. అమరావతి అరటితోటల్లో - ఎన్టీఆర్ ఇంట్లో - కాపు ఉద్యమంలో మండిన నిప్పులాంటి వాడు` అని భూమన ఆరోపించారు. కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగాను హత్య చేయించడంలో ప్రధాన భూమిక పోసించిన వ్యక్తి చంద్రబాబేనని అప్పటి హోంమంత్రి హరిరామ జోగయ్య ప్రకటించారని భూమన గుర్తు చేశారు. మల్లెల బాబ్జి అనే వ్యక్తితో ఎన్టీఆర్ పై చంద్రబాబు దాడి చేయించాడని - అనంతరం బాబ్జీ ఆత్మహత్యకు కూడా చంద్రబాబే కారణమని చరిత్ర చెబుతుందన్నారు. అనంతపురంలో 600ల మందిని శవాలు కూడా కనిపించకుండా హత్య చేయించడం వెనుక చంద్రబాబు అధికార దాహం తప్ప మరొకటి లేదన్నారు.