Begin typing your search above and press return to search.

బాబు విష‌యంలో కానిస్టేబుల్‌ తో విచార‌ణ‌

By:  Tupaki Desk   |   20 Oct 2016 12:46 PM GMT
బాబు విష‌యంలో కానిస్టేబుల్‌ తో విచార‌ణ‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్తుల ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎద్దేవా చేసింది. ఆస్తుల ప్ర‌క‌ట‌న‌తో ఆద‌ర్శంగా నిల‌వడం సంగ‌తేమో కానీ దేశంలోనే పెద్ద జోక్ వేసిన సీఎంగా చ‌రిత్ర‌లో నిలిచిపోయార‌ని వైసీపీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్‌ వెల్లడించిన ఆస్తుల ప్రకటన అంతా ఒక బూటకమని - ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తో విచారణ జరిపించినా అవినీతి ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడతాయని భూమన ఎద్దేవా చేశారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పేదరిక కుటుంబం మాదిరిగా లోకేష్‌ ఆస్తులను ప్రకటించాడన్ని భూమన తప్పుబట్టారు. తప్పుడు స్టేట్‌ మెంట్లతో లోకేష్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు.

చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని, ఆస్తులు ప్రకటించినా, ప్రకటించకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని భూమన వ్యాఖ్యానించారు. చంద్రబాబు దేశంలో కల్లా ధనికుడైన ముఖ్యమంత్రి అని 13 సంవత్సరాల క్రితమే తెహల్కా డాట్‌ కమ్‌ అనే ప్రసార మాద్యమం బయటపెట్టిందని భూమ‌న అన్నారు. అక్రమాస్తులు - దోపిడీతో ఎదిగిన బాబు నేర చరిత్రను బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. తీవ్రవాది బిన్‌ లాడెన్ - అమన్ - హిట్లర్‌ లాంటి వాళ్లను ఎవరూ ఆదర్శంగా తీసుకోరని, చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే అంతకంటే ప్రమాదకరమని విమర్శించారు. బాబు ఆస్తుల ప్రకటన విని...నాకంటే పేదవాడు దేశంలో లేడని అంబానీ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నామని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ తో అబద్ధాలను బాగా మాట్లాడించారన్నారు. లోకేష్‌ బాబు టీడీపీకి షోకేస్‌ బాబులా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. 2010 సెప్టెంబర్‌ 2వ తేదిన మొదటి సారిగా బాబు తన ఆస్తులను ప్రకటించారని, ఒక పక్క రాష్ట్రమంతా విషాదకరంగా దివంగత మహానేత వైయస్‌ ఆర్‌ వర్థంతి నిర్వహిస్తుంటే చంద్రబాబు ఆస్తులను ప్రకటించారన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన వార్తను పక్కదోవ పట్టించేందుకు బాబు ఆస్తుల ప్రకటన చేస్తారని భూమ‌న త‌ప్పుప‌ట్టారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాల విషయంలో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పును ప్రకటించిన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బాబు లోకేష్‌ తో తప్పుడు ఆస్తుల ప్రకటన చేయించారని మండిపడ్డారు. ఆస్తులు ప్రకటించిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ నేతలు చెప్పడం హేయనీయమని భూమ‌న వ్యాఖ్యానించారు. ఏ విషయంలో బాబును ఆదర్శంగా తీసుకోవాలని ప్రశ్నించారు. హోదాను తాకట్టుపెట్టినందుకా? లేక ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కొని కేంద్రం దగ్గర సాగిలపడినందుకా? సొంత మామను వెన్నుపోటు పొడిచినందుకు ఆదర్శంగా తీసుకోవాలా అని నిలదీశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు - పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందల కొద్ది హామీలు ఇచ్చి తుంగలో తొక్కి రైతాంగం ఉసురుపోసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడాన్ని ఆదర్శంగా తీసుకోవాలా అని భూమ‌న‌ ప్రశ్నించారు. చంద్రబాబును దోపిడీ దొంగలు - అవినీతి పరులు - వెన్నుపోటు దారులు ఆదర్శంగా తీసుకుంటారని స్పష్టం చేశారు. దేశంలోనే ఏ రాజకీయ నేతకు లేనన్ని ఆస్తులను చంద్రబాబు కుటుంబం కూడబెట్టిందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి సుద్దులు మానుకోవాలని హితవు పలికారు. బలి చక్రవర్తుల వారసుల్లా మాట్లాడడం అంటే భూతాలు భగవద్గీత శ్లోకాలు వల్లించడమేనని ఆయ‌న ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/