పవన్ షాక్‌ను భూమా వారసులు బాగా కవర్ చేశారుగా!

Thu Aug 17 2017 11:24:37 GMT+0530 (IST)

రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. సహజంగా తమకు అనుకూలంగా ఉన్న వారినే ఎవరైనా ఆకాశానికి ఎత్తుతారు అది సాధారణ వ్యవహారాల్లో అయినా రాజకీయంగా అయినా. కానీ దిమ్మతిరిగే షాకిచ్చినా ఆ పరిణామాన్ని లైట్ తీసుకోవడం అంతేకాకుండా సంతోషం వ్యక్తం చేయడం అంటే...నిజంగా గ్రేట్ కదా! సరిగ్గా అదే చేశారు సీనియర్ రాజకీయవేత్తలైన దివంగత భూమానాగిరెడ్డి-శోభనాగిరెడ్డి వారసులు!

నంద్యాల ఉప ఎన్నిక స్థూలంగా విశ్లేషిస్తే అధికార తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీపైనే అందరి దృష్టి పడింది. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగినప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ పెట్టడాన్ని ఓ పట్టాన తేల్చలేదు. చివరాఖరికి బరిలో ఉండనని తేల్చిన పవన్ తన మద్దతు విషయంలోనూ అదే ఉత్కంఠను కొనసాగించారు. సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత...``నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. అలా ఎవరైనా ప్రచారం చేసుకుంటే నమ్మవద్దు. ఇంకా క్షేత్రస్థాయిలో జనసేనకు బలం లేదు కాబట్టి మద్దతు విషయమై ప్రకటించడం లేదు.`` అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జనసేనాని చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా నంద్యాల పోరుతో రాజకీయ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుంటున్న భూమ శిబిరాన్ని షాక్‌కు గురిచేసింది.

తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ తమకు తప్పకుండా మద్దతు ఇస్తారని టీడీపీ భావించింది. ఈ మేరకు మద్దతు కోసం మంత్రి అఖిలప్రియ పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో సంభాషించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ చేసిన ప్రకటనతో అవాక్కయిన భూమా కుటుంబ సభ్యులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రకటనపై మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశమని అదే రీతిలో భూమా కుటుంబ సభ్యులు సైతం ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు తమకే ఉంటుందని విశ్లేషించారు. అంతేకాదు జనసేన పార్టీ ఇంకా బలపడలేదు కాబట్టి పోటీకి దిగకపోవడం మద్దతు ప్రకటనను బహిరంగంగా చెప్పకపోవడమే సరైనదని మంత్రి అఖిలప్రియ సోదరి మౌనిక రెడ్డి తెలిపారు!