వచ్చేస్తోంది... న్యూ ఎన్నికల ఇయర్ జోష్ !

Mon Dec 10 2018 13:58:53 GMT+0530 (IST)

డిసెంబర్. అదీ 31 వ తేదీ. ఇంకేముంది. కొత్త సంవత్సరానికి హుషారుగా స్వాగతం పలికే రోజు. మందు - విందులు - చిందులకు ఇదే కాలం. ఇదే సమయం. అన్నట్లు రానున్నది ఎన్నికల కాలం కూడా కావడంతో ఆంధ్రప్రదేశ్ లో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈ న్యూ ఇయర్ వేడుకలను న్యూ ఎన్నికల ఇయర్ గా జరుపుకునేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన రాజకీయ నాయకులైతే తమ అనుచరగణానికి భారీగా విందులు - వినోదాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆ పార్టీ - ఈ పార్టీ అని లేదు. ఈ పార్టీ నాయకుడు... ఆ పార్టీ నాయకుడు అని లేదు. అందరూ ఒకే దారిలో నడుస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులందరూ న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ప్రతి ఏటా తమ అనుచరులు - కార్యకర్తలు - ప్రజల్లో సన్నిహితులకు పార్టీలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తమ సత్తా ఏపాటిదో చూపించుకుందుకు కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు రాజకీయ నాయకులు.ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలలోనూ టిక్కట్లు ఆశిస్తున్న వారు ఒకరు కంటే ఎక్కువ మందే ఉన్నారు. దీంతో తమ బల నిరూపణ కోసం న్యూ ఇయర్ పార్టీలను ఎంచుకుంటున్నారు నాయకులు. అళ్లగడ్డలో మామ - కోడళ్ల మధ్య ఈ పోరు ఉత్కంఠగా మారింది. ఎవరు బాగా పనిచేస్తారో వారికే ఈసారి టిక్కట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఏవీ సుబ్బారెడ్డి - అఖిలప్రియల మధ్య టిక్కట్ల పోరు రసవత్తరంగా మారిందంటున్నారు. తెలుగు తమ్ముళ్లను తమ వైపు తిప్పుకుందుకు నానా తంటాలు పడుతున్నారంటున్నారు. మంత్రి అఖిలప్రియ కార్యకర్తలను తన వైపు తిప్పుకుందుకు ఈ న్యూ ఇయర్ పార్టీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో చాలా మందిని వ్యక్తిగతంగా కలిసి న్యూ ఇయర్ పార్టీలకు ఆహ్వనించినట్లు సమాచారం. తానేమీ తక్కువ కాదు అన్నట్లుగా ఏ.వీ.సుబ్బారెడ్డి కూడా కార్యకర్తలు - అనుచరగణంతో పాటు నియోజకవర్గంలో కీలక వర్గాలకు చెందిన వారిని వ్యక్తిగతంగా కలిసి న్యూ ఇయర్ పార్టీలకు ఆహ్వాస్తున్నారని సమాచారం. మామ - కోడళ్లలో ఎవరికి టిక్కట్ దక్కుతుందో ఈ న్యూ ఇయర్ పార్టీల్లో తేలిపోనున్నది.