అఖిల ప్లాన్!... ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!

Thu Jul 12 2018 17:24:33 GMT+0530 (IST)

తెలుగు నేల రాజకీయాల్లో తమకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న భూమా నాగిరెడ్డి భూమా  శోభానాగిరెడ్డి... ఏ  పార్టీలో ఉన్నా ఓ వెలుగు వెలిగారని చెప్పక తప్పదు. టీడీపీలో ఉన్నా - ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లినా - ఆ తర్వాత వైసీపీలోకి వచ్చినా... ఆయా పార్టీలు భూమా దంపతులకు మంచి ప్రాధాన్యమే ఇచ్చాయి. అయితే శోభానాగిరెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత నాగిరెడ్డి పార్టీ  ఫిరాయించేశారు. ఒకే కుటుంబానికి రెండు అసెంబ్లీ టికెట్లతో పాటుగా ప్రతిపక్షానికి దక్కిన కీలక పదవి అయిన పీఏసీ చైర్మన్ పదవిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తనకే కేటాయించినా కూడా భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించేశారు. ఆ  తర్వాత కొంతకాలానికే ఆయన గుండెపోటుకు గురై మరణించారు. శోభానాగిరెడ్డి మరణానంతరం ఆమె వారసురాలిగా ఎంట్రీ  ఇచ్చిన భూమా దంపతుల పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ... నాగిరెడ్డి  మరణానంతరం మొత్తంగా ఆ  ఫ్యామిలీకే పెద్ద దిక్కయ్యారు. తమ్ముడు - చెల్లి - పెదనాన్న సంతానం అందరినీ చూసుకుంటూ ముందుకు సాగాల్సిన  కీలకమైన బాధ్యతలను భుజానికెత్తుకున్న అఖిల... తన తండ్రి మరణంతో ఖాళీ  అయిన నంద్యాల సీటును పెదనాన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి ఇప్పించుకోవడంతో పాటుగా మొత్తం టీడీపీ నేతలందరినీ అక్కడికి  రప్పించేసి సోదరుడిని గెలిపించుకున్నారు. అంతేకాకుండా తన తల్లిదండ్రులకు దక్కని మంత్రి పదవిని కూడా అఖిల చేజిక్కించుకున్నారు.మొత్తంగా చాలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు వచ్చి మీద పడిన కీలక తరుణంలో  అఖిల వాటన్నింటికీ న్యాయం చేస్తుందా? అన్న అనుమానాలు మొన్నటిదాకా ఉండేవి. అయితే భూమా ఫ్యామిలీ  వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా మునుపటి కంటే కూడా ఆ  ఫ్యామిలీని రాజకీయాల్లో మరింతగా రాణించే సత్తా తనకుందంటూ ఆమె నిరూపించుకున్నారన్న మాట వినిపిస్తోంది. చాలా చిన్న వయసులోనే మంత్రి పదవిని అందుకున్న అఖిల... భూమా నాగిరెడ్డికి అత్యంత  సన్నిహితుడిగా పేరున్న ఏవీ  సుబ్బారెడ్డితో గొడవ  పెట్టుకుని అధిష్ఠానం వద్ద తన మాటే చెల్లుబాటు అయ్యేలా  చూసుకున్నారు. ఏవీ  సుబ్బారెడ్డితో వివాదం నేపథ్యంలో పంచాయతీ కోసమంటూ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి నుంచి కబురు అందినా... తాను రాలేనని ముఖం మీదే చెప్పేసిన అఖిల... వ్యూహాత్మకంగానే ఏవీపై పైచేయి సాధించారు. ఆ తర్వాత తన మేనమామ ఎస్వీ  మోహన్ రెడ్డి బెర్తుపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు రంగంలోకి దిగిన అఖిల... అందులోనూ సత్తా చాటారనే చెప్పాలి. చంద్రబాబు వద్ద తన పప్పులు ఉడకవని గ్రహించిన అఖిల... వ్యవహారాన్ని  చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేశ్ ద్వారా నరుక్కుంటూ వచ్చారని ప్రచారం సాగుతోంది.

మొన్నటి కర్నూలు పర్యటనలో భాగంగా నారా లోకేశ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో  ఏనాడూ అభ్యర్థుల ప్రకటన ముందుగా ఉండేది  కాదు. అందుకు భిన్నంగా వ్యవహరించిన లోకేశ్... కర్నూలు లోక్‌సభ అసెంబ్లీ అభ్యర్థులను ఘనంగా ప్రకటించేశారు. ఎంపీ సీటును  బుట్టా రేణుకకు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన లోకేశ్... ఎమ్మెల్యే సీటును ఎస్వీ మోహన్ రెడ్డికి కేటాయించేశారు. ఈ ప్రకటన  టీడీపీలో అగ్గిని రాజేసిందని  వార్తలు వినిపిస్తున్నాయి. అయినా టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్... తన తనయుడు టీజీ భరత్ ను కర్నూలు అసెంబ్లీ నుంచి బరిలోకి దించేందుకు దాదాపుగా  రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో టీజీ భరత్‌కు ఆదిలోనే బ్రేక్ పడిపోయింది. మరోవైపు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయంలో ఇష్టం లేకున్నా... ఆ  విషయంలో తనకు తన తనయుడు లోకేశ్ తో విబేధాలు ఉన్నాయన్న విషయాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకోసం చంద్రబాబు ఎస్వీకే సీటు ఖరారు చేశారట. అంటే అఖిల రచించిన వ్యూహానికి అటు టీజీకి దిమ్మతిరిగిపోగా... 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... తనకు ఇష్టంలేని వ్యక్తికి సీటు ఖరారు చేశారన్న మాట.