Begin typing your search above and press return to search.

అఖిల‌ప్రియ 'క‌సి' మాట‌లు విన్నారా?

By:  Tupaki Desk   |   1 Jan 2019 6:06 AM GMT
అఖిల‌ప్రియ క‌సి మాట‌లు విన్నారా?
X
రాజ‌కీయాలు ఏ మాత్రం ప‌రిచ‌యం లేకున్నా.. అవ‌గాహ‌న పెద్ద‌గా లేకున్నా.. ఒక్క‌సారి అందులోకి ఎంట‌రైతే చాలు.. అదే పాఠాలు నేర్పించేస్తుంది. ఏపీ మంత్రి అఖిల‌ప్రియ‌ను తీసుకోండి.. త‌న త‌ల్లి దివంగ‌త శోభానాగిరెడ్డి మ‌ర‌ణం ముందు వ‌ర‌కూ ఆమెకు రాజ‌కీయాలు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. త‌న‌దైన ప్ర‌పంచంలో ఉండేవారు.

కానీ..త‌ల్లి మ‌ర‌ణంతొ ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల్సి వ‌చ్చింది. త‌డ‌బ‌డుతూ.. అడుగులు వేస్తున్న వేళ.. కొండంత అండ‌లాంటి తండ్రిని పోగొట్టుకొని భూమా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా మారింది. చిన్న వ‌య‌సులో అంత పెద్ద బాధ్య‌త‌ను ఆమె ఎలా మోస్తుంద‌న్న సందేహం ప‌లువురిలో వ్య‌క్త‌మైనా.. త‌న స‌త్తా చాటింది.

క్యాలెండ‌ర్లు మారుతున్న కొద్దీ.. ఆమె అంత‌కంత‌కూ ధృడ‌మ‌వుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌ల్ని చెప్పొచ్చు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. అఖిల‌ప్రియ నోటి వెంట వ‌స్తున్న మాట‌లు చూస్తే.. రానున్న రోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుంద‌న్న విష‌యం ఇప్పుడే అర్థ‌మ‌వుతుంది.

తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. రాజ‌కీయంగా రాటుతేల‌టంతో పాటు.. ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఉండే ఆత్మ‌స్థైర్యం ఆమెలో కొట్టొచ్చున‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ల‌గ‌డ్డ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి అఖిల‌ప్రియ చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే..

= ఓ మీడియా ప్రతినిథి ఫోన్ చేసి - మేడమ్.. మీ పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నారట, ఎలా ఫీలవుతున్నారని అడిగారు. దానికి తాను బ‌దులిస్తూ.. వాళ్లు ఇంకా పార్టీలోనే ఉన్నారా? అని ఎదురు ప్రశ్నించా. వాళ్లు అసలు పార్టీలో ఉన్నారనే సంగతి కూడా మరిచిపోయాన‌ని చెప్పా.

= ఆ రిపోర్టర్‌ కు ఓ సలహా కూడా ఇచ్చా. మీరు నాకు ఫోన్ చేసి ఎలా ఫీల్ అవుతున్నారని అడగడం కాదు.. ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి అదే విష‌యాన్ని అడగాలని చెప్పా.

= ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారు. పదవుల కోసమో - రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారు. ఏకమవుతున్న నా ప్రత్యర్థులకు - వారి కేడర్‌ కు ఒక్కటే చెబుతున్నా. ఇన్నాళ్లు ఆయన కోసం మీరు ఇబ్బంది ప‌డ్డారు. మీపై కేసులు వచ్చాయి. మీరు న‌ష్ట‌పోయారు. కానీ.. ఈ రోజు మిమ్మ‌ల్ని ప‌క్క‌న పెట్టి.. తన లబ్ధి కోసం జ‌గ‌న్ పార్టీలోకి వెళుతున్నారు.

= ప్రత్యర్థి కేడర్‌ కు నేను చెప్పేది ఒక్క‌టే. మీరు పని చేయాలనుకుంటే.. మీకు గౌరవం కావాలనుకుంటే మా వద్దకు రండి. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. భూమా కేడర్ ది పెద్ద మనసు. ఎవరు వచ్చినా వాళ్లను స్వీకరించే మంచి మనసు ఉంది. ఇక్కడ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి.

= అవతలి వాళ్లకు కూడా చెబుతున్నా. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా వద్దకు వస్తే - నేను మిమ్మల్ని కూడా చూసుకుంటా. చాలామంది నా వద్దకు వచ్చి మన వాళ్లకు ఇంకా కసి రావట్లేదని చెబుతున్నారు. కానీ ఆ కసి సమయం వచ్చినప్పుడు వస్తుంద‌ని చెప్పా. మా వాళ్లకు అది వస్తే మీరు తట్టుకోలేరని చెప్పా. మ‌నోళ్ల‌కు క‌సి వ‌స్తే అది సునామీ లెక్క ఉంటుంది.

= చాలామంది టెన్షన్ పడుతున్నారు. అలాంటిదేమీ అక్క‌ర్లేదు. ఇక్కడ చాలామంది నా గెలుపుపై మాట్లాడలేదు. నాకొచ్చే మెజార్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.నంద్యాల ఉప ఎన్నికల సమయంలోను నేను ఓ సవాల్ చేశా. భూమా బ్రహ్మానంద రెడ్డి గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పా. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా - భూమా వర్గం నాయకురాలిగా ఉన్న తాను నియోజకవర్గంలో మరొకరితో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు.

= నేను చావనైనా చస్తాను కాని ఒకరి వద్ద తలదించను. మిమ్మల్ని (తన కేడర్) కూడా తలదించకుండా చూసుకుంటా. ఇన్ని రోజులు వర్గం కోసమో - గ్రూప్ కోసమో మీరు త్యాగాలు చేశారు. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా చూశా. నా తల్లిదండ్రులు కూడా మీ కోసం ఎంతో తపించడం చూశా. అవన్నీ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తలదించుకోనియకుండా రాజకీయం చేస్తా.