భూమా మార్కు జులుం... మహిళా ఎస్సైతో వాగ్వాదం

Wed Sep 11 2019 14:33:49 GMT+0530 (IST)

భూమా అఖిలప్రియ... తండ్రికి  తగ్గ తనయ అనిపించుకున్నారన్న వాదనకు తెర తీసినట్టుగానే కనిపిస్తున్నారు. తనను బయటకు వెళ్లనివ్వలేదన్న అక్కసుతో ఏకంగా ఓ మహిళా ఎస్సైపైనే ఆమె తనదైన శైలి జులుం ప్రదర్శించారు. నేనెవరో తెలుసా? అంటూ పోలీసులకే హెచ్చరికలు జారీ చేస్తూ... అనుచరులతో కలిసి నానా రచ్చ చేశారు. పోలీసులపైనే తనదైన శైలి జులుంను ప్రదర్శించిన భూమా అఖిలప్రియకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ గా మారిపోయాయి.ఈ సందర్భంగా ఏం జరిగిందన్న విషయానికి వస్తే... టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందంటూ విపక్షం నేడు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా... శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ వినతిని రెడ్ సిగ్నల్ వేశారు. అనుమతి లేకుండా నిర్వహించే ర్యాలీలు నిరసనలకు అవకాశమే లేదంటూ పోలీసులు పల్నాడు పరిధిలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. అయితే పోలీసులు అడ్డంకులు సృష్టించినా తాము ఆగేది లేదన్న రీతిలో టీడీపీ నేతలు కదిలారు.

ఈ క్రమంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందన్న భావనతో నిన్న రాత్రి నుంచే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రానికే అమరావతి చేరుకున్న మాజీ మంత్రి మొన్నటి ఎన్నికల్లో తన సొంతూరు ఆళ్లగడ్డలో చిత్తుగా ఓడిన అఖిలప్రియ విజయవాడలోని ఓ హోటల్ లో బస చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

పోలీసులు బయటకు రావద్దన్నా వినని అఖిల... తనను ఎందుకు? ఎలా? అడ్డుకుంటారో చూస్తానంటూ హోటల్ లోని తన గది నుంచి బయటకు రావడమే కాకుండా హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హోటల్ నుంచి తమరిని బయటకు వెళ్లనీయబోమని మహిళా ఎస్సై... అఖిలకు తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశానికి గురైన అఖిల...నేనెవరో తెలుసా? అంటూ మహిళా ఎస్సైపై జులుం ప్రదర్శించారు. అంతేకాకుండా తన అనుచరులను అక్కడికి రప్పించి పోలీసులను భయభ్రాంతులకు గురి చేసే యత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూసిన జనం... ఎంతైనా భూమా నాగిరెడ్డి కూతురు కదా... వారసత్వం ఎక్కడికి పోతుందిలే అన్న చందంగా సెటైర్లు వేస్తున్నారు.