Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అనే నేను.. త్రిక‌ర‌ణ‌శుద్దితో..!

By:  Tupaki Desk   |   16 Oct 2018 5:04 AM GMT
ప‌వ‌న్ అనే నేను.. త్రిక‌ర‌ణ‌శుద్దితో..!
X
ఆ మ‌ధ్య‌న మ‌హేశ్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా వ‌చ్చింది. అందులో భ‌ర‌త్ పాత్ర‌లో మ‌హేశ్ బాబు సీఎంగా న‌టించ‌టం తెలిసిందే. భ‌ర‌త్ అనే నేను.. అంతఃక‌ర‌ణ శుద్ధితో అంటూ చెప్పే డైలాగ్ ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు. తాజాగా రాజ‌మండ్రిలో ప‌వ‌న్ నిర్వ‌హించిన క‌వాతు స‌భ‌లో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాపుల గురించి మాట్లాడారు. తన త‌ల్లి నెల్లూరు బ‌లిజ కుటుంబానికి చెందిన వార‌న్న ప‌వ‌న్‌.. తాను కాపుల‌ను దూరం పెడుతున్నాన‌ని కొంద‌రు చెబుతున్నారన్నారు. తాను కాపుల‌ను ఎందుకు దూరం పెడ‌తాన‌ని ప్ర‌శ్నించారు. కులాలు.. మ‌తాలు.. ప్రాంతాల‌ను స‌మానంగా చూసే జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని మ‌న‌స్ఫూర్తిగా చెబుతున్న‌ట్లు చెప్పిన ప‌వ‌న్‌.. త‌న‌కు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావును ఆద‌ర్శంగా తీసుకున్నాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

తాను ఏ ప‌ని చేసినా త్రిక‌ర‌ణ శుద్దితో ప‌ని చేస్తాన‌ని.. కులాల ఐక్య‌త‌ను కోరుకుంటాన‌ని చెప్పారు. బ్రిటీష్ కాలంలో కాపులు స‌హ‌జంగా బీసీలుగా ఉన్నార‌న్నారు. త‌న బంధువుల్లోనే తాను అసంఘ‌టిత కార్మికుల‌ను చూశాన‌ని.. సోడా బండీ.. ఇడ్లీ బండి.. బ‌స్టాండ్ వ‌ద్ద బండ్లు పెట్టుకొని బ‌తికిన వారు ఉన్న‌ట్లు చెప్పారు.

త‌న‌కు వేల కోట్ల ఆస్తి ఉన్న బంధువులు లేర‌ని.. త‌న బంధువులంతా సామాన్యులే అన్నారు. తాను దొంగ‌చాటుగా కాకుండా సూటిగా మాట్లాడుతున్న‌ట్లు చెప్పిన ప‌వ‌న్‌.. త‌న గురించి ఎవ‌రో దొంగ‌చాటుగా చెప్పే బ‌దులు.. తానే సూటిగా మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. తాను ఎన్నిక‌ల ఎత్తుగ‌డ కోసం మాట్లాడ‌టం లేద‌ని.. అర్థం చేసుకుంటార‌ని మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు.

ముస్లిం మైనార్టీల వెనుక‌బాటు గురించి ఎలా అయితే మాట్లాడ‌తారో.. కాపుల గురించి కూడా అలాగే మాట్లాడుతాన‌ని చెప్పారు. కాపుల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు. తాను ఏ కులంలో పుట్టాలో.. ఏ భాష‌లో మాట్లాడాలో అనుమ‌తి తీసుకోని పుట్ట‌లేద‌న్నారు. ప‌వ‌న్ ఏ కులంలో పుట్టినా ఇలానే ఉండేవార‌ని.. స‌రికొత్త నేత రాబోతున్న‌ట్లు చెప్పారు. చంద్ర‌బాబు అయినా ఎవ‌రైనా తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం దెబ్బ తీయొద్ద‌న్నారు. కులాల గురించి మాట్లాడ‌న‌ని.. కులాల మీద మాట్లాడ‌టం తన‌కు న‌చ్చ‌ద‌ని చెప్పే ప‌వ‌న్‌.. తాజా స‌భ‌లో మాత్రం అందుకు భిన్నంగా కులాల గురించి ఇంత‌లా మాట్లాడ‌టంలో మ‌ర్మ‌మేంది ప‌వ‌నా?