Begin typing your search above and press return to search.

ముగిసిన నంద్యాల పోరు..80శాతానికి పైగా పోలింగ్‌

By:  Tupaki Desk   |   23 Aug 2017 1:48 PM GMT
ముగిసిన నంద్యాల పోరు..80శాతానికి పైగా పోలింగ్‌
X
రాష్ట్రవ్యాప్తంగా అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకొన్న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అక్కడక్కడ గొడవలు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం ఆరు గంట‌ల లోగా క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌ లాల్‌ చెప్పారు. నేటి సాయంత్రం 5 గంటల వరకూ తనకు అందిన సమాచారం ప్రకారం 76 శాతం పోలింగ్‌ జరిగిందని ఆయన చెప్పారు. ఇది గత ఎన్నికలకంటే అధికమని ఆయన అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత భన్వర్‌ లాల్‌ మీడియాతో మాట్లాడుతూ 2009లో 76 శాతం - 2014లో 71 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన అన్నారు. ఓట్లు వేయడానికి ఇంకా ప్రజలు క్యూలో ఉన్నారని, పోలింగ్‌ పూర్తి అయ్యేసరికి 81 నుంచి 82 శాతం వరకూ ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికల విధుల్లో గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి చెందాడని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌ లాల్‌ చెప్పారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ కు కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించామన్నారు.నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని భన్వర్‌ లాల్‌ చెప్పారు. కాగా, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా గాంధీనగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీనగర్ లోని పోలింగ్ బూత్ వద్ద వైకాపా - తెలుగుదేశం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకూ చెందిన పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు.

మ‌రోవైపు నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యాలు చేయడంతో టీడీపీ ఎంపీల ఫిర్యాదు మేరకు జగన్‌ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈసీ ఆదేశాల మేరకు ప్రాతినిధ్య చట్టం 125 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 - 504 - 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.