Begin typing your search above and press return to search.

జీవిత‌ఖైదు కాదు...ఉరిశిక్ష ప‌డాల్సింది

By:  Tupaki Desk   |   18 Dec 2018 3:40 PM GMT
జీవిత‌ఖైదు కాదు...ఉరిశిక్ష ప‌డాల్సింది
X
సంచ‌ల‌నం సృష్టించిన మ‌ద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువ‌డిది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది కోర్టు. రెండో నిందితుడు మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిర్దోషులుగా తేలిన వారిలో సుబ్బయ్య - వెంకటరమణ - హరిబాబు - వంశీలు ఉన్నారు. కాగా ఈ తీర్పుపై సూరి స‌తీమ‌ణి భానుమ‌తి స్పందించారు. భానుకు ఉరిశిక్ష ప‌డాల్సింద‌ని వ్యాఖ్యానించారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ కు ఉరిశిక్ష పడి ఉంటే బాగుండేదని, అప్పుడే సూరి ఆత్మ శాంతించేది అని సూరి సతీమణి గంగుల భానుమతి పేర్కొన్నారు. నాంపల్లి కోర్టు తీర్పుపై స్పందించిన భానుమతి.. ``సూరి పక్కనే ఉంటూ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు. ఆస్తుల గొడవలు ఏం లేవు.. కానీ ఆస్తుల కోసమే భానుకిరణ్ ఈ పని చేసి ఉండొచ్చు. ఇలా చేస్తాడని ఎవరికీ అనుమానం రాలేదు. మా అన్నం తిని, మా వ‌ద్ద ఉండి.. ఇంత పని చేస్తాడనుకోలేదు. మద్దెలచెర్వు సూరి అంటే అందరూ వణుకుతారు. దీంతో ఆయన పేరు చెప్పుకొని భానుకిరణ్ ఆస్తులు సంపాదించుకున్నాడు. భానుకిరణ్‌ కు యావజ్జీవ కారాగార శిక్ష ఉంటే ఉరి శిక్ష పడి అంటే సూరి ఆత్మ శాంతించేది`` అని భానుమతి తెలిపారు.

2011, జనవరి 3న యూసుఫ్ గూడలోని నవోదయ కాలనీలో భానుకిరణ్ చేతిలో సూరి హత్యకు గురైన విషయం తెలిసిందే. సూరి కారు డ్రైవర్ మధుమోహన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భాను కిరణ్ ను 2012 ఏప్రిల్ 21న జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను 2011 - జనవరి 29న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసు ఏడేళ్ల పాటు సుదీర్ఘరంగా విచారణ కొనసాగింది. భాను కిరణ్ పై మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. 117 మంది సాక్షులను నాంపల్లి కోర్టు విచారించింది. 2016 ఆగస్టు 29న మద్దెలచెర్వు సూరి భార్య భానుమతి వాంగ్మూలంతో విచారణ మొదలైంది. నేడు తుది తీర్పు వెలువ‌డింది.