Begin typing your search above and press return to search.

ఓడ, విమానాల అదృశ్యానికి కారణం ఇదే!

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:52 AM GMT
ఓడ, విమానాల అదృశ్యానికి కారణం ఇదే!
X
కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని మిస్టరీ బెర్ముడా ట్రయాంగిల్‌! ఏమి జరుగుతుందో తెలియలేదు కానీ... ఆ ప్రాంతానికి రాగానే ఓడలు, విమానాలు అదృశ్యమయిపోతున్నాయి. దానికి గల కారణాల కోసం మాత్రం అన్వేషణ అలా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో ఉన్న అంతుచిక్కని రాహస్యాన్ని, చాలా మంది చెబుతున్నట్లున్న దైవ రహస్యాన్ని - కొంతమంది పేర్కొంటున్నట్లు గ్రహాంతర వాసుల పనిని దాదాపు ఛేదించామని తాజాగా ప్రకటించారు శాస్త్రవేత్తలు.

వాయువ్య అట్లాంటిక్ సముద్రంలోని ఒక ప్రాంతమే ఈ బెర్ముడా ట్రయాంగిల్. అయితే ఈ ప్రాంతంలోని జలాల్లో భారీ నౌకలను - విమానాలను సైతం అలవోకగా సముద్రంలోకి లాగేస్తోంది ఏదో ఒక శక్తి. ఆ శక్తి రహస్యాన్ని దాదాపు ఛేదించామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ విషయంపై అంతర్జాతీయంగా వచ్చిన కథనాల ప్రకారం.... "సముద్రంలో మయామి - పుయెర్టోరికో - బెర్ముడా ద్వీపం మధ్య భాగంలో "బెర్ముడా ట్రయాంగిల్" ఉంది. ఈ సముద్రప్రాంతంపై అత్యంత శక్తివంతమైన షడ్భుజాకృతిలో గాలి మేఘాలు 32 నుంచి 80 కి.మీ.ల విస్తీర్ణంలో ఏర్పడుతున్నాయి. గంటకు 273 కి.మీల. వేగంతో దూసుకొచ్చే తుపానులకు ఉండేంత శక్తి ఈ గాలి మేఘాలకు ఉంటుంది. ఓడలను - విమానాలను ఈ గాలి మేఘాలే కిందకు తోసి సముద్రంలో ముంచేస్తున్నాయి" అని పరిశోధకుడు డాక్టర్ ర్యాండీ కార్వెనీ వివరించారు. దీంతో ఆ అద్భుత శక్తిపై ఒక క్లారిటీ వచ్చినట్లే చెప్పుకోవచ్చు.

కాగా, బెర్ముడా ట్రయాంగిల్ గా పిలవబడే ఈ ప్రాంతాన్ని "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా పిలుస్తుంటారు. చాలా కాలం నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతున్నాయి. దీంతో ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా ఇది పరిగణించబడింది. ఇక్కడ జరిగిన అనేక సంఘటనల గురించి రకరకాల కథలు - ఊహలు - సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ప్రకృతి సహజమైన భౌతిక విషయం అని కొందరంటే... అబ్బే ఇది గ్రహాంతర వాసుల పని అని మరికొందరు చెప్పుకొచ్చారు అయితే ఈ విషయాలపై శాస్త్రవేత్తలు తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/