Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వంపై 5000 మంది టెక్కీల పోరు

By:  Tupaki Desk   |   30 Nov 2015 1:54 PM GMT
ప్ర‌భుత్వంపై 5000 మంది టెక్కీల పోరు
X
నగర రహదారులు నరకప్రాయంగా మారాయి. దారి పొడవునా గుంతలు... సూదుల్లా మొనదేలిన రాళ్లు...అడుగు తీసి... అడుగు వేసేందుకే హడలెత్తిస్తున్నాయి. ‘ఆకాశ మార్గాల’ వైపు చూస్తున్న ప్రభుత్వం ... నేల వైపు తొంగి చూడడం లేదు. ఫలితంగా రహదారులు గోదారులవుతున్నాయి. రోడ్లపైనే సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఈ సుడులలో చిక్కి...ఎంతోమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప‌న్నులు వేల‌ల్లో...ప‌నులు వేళ్ల‌పై. ఘ‌న‌త వ‌హించిన పాల‌కులు ఏ రాష్ర్టంలో అయినా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల ద్వారా సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌తున్నామ‌ని చెప్పే నాయ‌కులు అదేమీ చేయ‌క‌పోవ‌డంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ రోడ్డెక్కారు.

బెంగ‌ళూరులోని అధ్వాన్న‌మైన రోడ్ల‌ను చూసి అక్క‌డి సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు ఆక్రోషం వ్య‌క్తం చేశారు. బెంగ‌ళూరులో ఐటీ కంపెనీల‌కు కేంద్ర స్థానంగా ఉన్న వైట్‌ ఫీల్డ్‌ లో రోడ్లు అత్యంత ద‌రిద్రంగా ఉన్నాయి. వీటి నిర్వ‌హ‌ణ చూడాల్సిన స్థాని బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హ‌న‌గ‌ర పాలిక నిర్వ‌హ‌ణ‌ విష‌యాన్ని గాలికి వ‌దిలేసింది. దీంతో వివిధ ఎంఎన్‌ సీలు - జాతీయ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు #SaveWhitefield పేరుతో ప్ర‌చారం షురూ చేశారు.

ఐటీ ఉద్యోగుల వ‌ర్క్ బిజీ డే అయిన సోమ‌వారం ఉద‌యం 5,000 మందికి పైగా ఉద్యోగులు ఐటీ కారిడార్‌ లో కీల‌క‌మైన జంక్ష‌న్లు అయిన మ‌ర‌థ‌హ‌ళ్లీ - కుండ‌ల‌హ‌ల్లీ - గ్రాఫిటీ ఇండియా జంక్ష‌న్‌ - ఎపిక్‌ జోన్ ల‌లో సేవ్ వైట్ ఫీల్డ్ అని రాసి ఉన్న ప్ల‌కార్డులు చేతుల్లో ప‌ట్టుకొని నిల్చున్నారు. ఈ క్ర‌మంలో వారు చేతులు క‌ట్టి మాన‌వ‌హారంలాగా గుమికూడారు.

అయితే హైద‌రాబాద్‌ లో కూడా దాదాపు ఇదే ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డి పాల‌కులు ముందే మేలుకుంటే బాగుంటుందేమో. లేదంటే హైటెక్ సిటీలోనో లేదంటే గ‌చ్చిబౌలిలోనూ ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వ‌స్తుందేమో.