Begin typing your search above and press return to search.

గిటార్ చేతిలో పెట్టి... ఆప‌రేష‌న్ చేశార‌ట‌!

By:  Tupaki Desk   |   20 July 2017 10:46 AM GMT
గిటార్ చేతిలో పెట్టి... ఆప‌రేష‌న్ చేశార‌ట‌!
X
నిజంగా ఈ చికిత్స కొత్త‌దే. ఎందుకంటే... రోగి చేతిలో గిటార్ పెట్టి, అదే వ్య‌క్తికి వైద్యులు ఆప‌రేష‌న్ చేశారు. విన‌డానికి వింత‌గా ఉన్నా... బెంగ‌ళూరు వైద్యులు చేసిన నిజంగానే ఈ ఆప‌రేష‌న్ చేసేశారు. చిన్న గాయం అయితేనే కుట్లు వేయించుకునేందుకు మ‌నం గింజుకుంటా. నొప్పి భ‌రించ‌లేక నానా యాగీ చేస్తాం. ఈ యాగీ అంతా లేకుండా... మ‌న‌కు చికిత్స చేసేందుకే ఆప‌రేష‌న్ చేసే వైద్య బృందంలో అన‌స్థీయ‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటారు. పెద్ద ఆప‌రేష‌న్లు అయితే... మొత్తం శ‌రీరానికంత‌టికీ మ‌త్తు ఇచ్చే వైద్యులు రోగికి ఎలాంటి మెల‌కువ లేకుండానే ఆప‌రేష‌న్ చేసేస్తారు. ఏదో చిన్నా చిత‌క అప‌రేష‌న్ అయినా... ఆప‌రేష‌న్ చేసే భాగానికి మాత్ర‌మే మ‌త్తు మందు ఇచ్చి... రోగికి లేశ‌మాత్రం నొప్పి తెలియ‌కుండానే చికిత్స‌ను ముగించేశారు.

మ‌రి అలాంటిది రోగి చేతిలో గిటార్ పెట్టి, దానిని ఆ రోగి వాయిస్తూ ఉండ‌గానే.. ఆప‌రేష‌న్ చేశారంటే నిజంగా ఆస‌క్తిక‌ర‌మే క‌దా. ఏదో 5 నిమిషాలో, 10 నిమిషాల్లోనే ఈ ఆప‌రేష‌న్ ముగిసింద‌నుకునేందుకు వీలు లేదు. ఎందుకంటే ఏళ్ల త‌ర‌బ‌డి న్యూరోలాజిక‌ల్ డిజార్డ‌ర్‌ తో బాధ‌ప‌డుతున్న ఓ టెక్కీకి వైద్యులు ఈ త‌ర‌హా ఆప‌రేష‌న్‌ ను ఏకంగా ఏడు గంట‌ల పాటు సుదీర్ఘంగా నిర్వ‌హించారు. ఆప‌రేష‌న్ స‌క్సెస్ కాగా... ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు స‌ద‌రు రోగి ఇప్పుడు ఆ డిజార్డ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌ట‌మే కాకుండా... కొంత‌కాలంగా చ‌చ్చుబ‌డిపోయిన అత‌డి చేతివేళ్లు ఇప్పుడు చ‌క్క‌గా ప‌నిచేస్తున్నాయ‌ట‌. ఇన్ని విశేషాలున్న స‌ద‌రు ఆప‌రేష‌న్ గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌నిపిస్తోంది క‌దా. అయితే ఆ వివ‌రాల్లోకెళ్లిపోదాం ప‌దండి.

బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల‌ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొద్ది సంవత్సరాలుగా న్యూరోలాజికల్ డిజార్డర్‌ తో బాధపడుతున్నాడు. అంతేకాకుండా గిటార్ వాయించే అల‌వాటున్న స‌ద‌రు టెక్కీ... గిటార్ వాయిస్తున్న క్ర‌మంలోనే ఏడాది క్రితం చేతి కండ‌రాలు ప‌ట్టేశాయట‌. దీంతో అప్ప‌టి నుంచి ఎడ‌మ చేతికి చెందిన మూడు వేళ్లు ప‌నిచేయ‌డం మానేశాయ‌ట‌. ఈ మొత్తం ప‌రిస్థితిని ప‌రిశీలించిన వైద్యులు... బ్రెయిన్‌ కు ఆపరేషన్ చేయ‌డం త‌ప్పించి ప్ర‌త్యామ్నాయం లేద‌ని తేల్చేశారు. ఆప‌రేష‌న్ చేయించుకోవడానికి ఆ టెక్కీ కూడా సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేయ‌డంతో ఆప‌రేష‌న్‌ కు ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. రోగిని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ లోకి తీసుకెళ్లిన వైద్యులు... వారి వెంట ఓ గిటార్‌ ను కూడా లోప‌లికి తీసుకెళ్లారు.

ఆప‌రేష‌న్ మొదలుపెట్టే స‌మ‌యంలో బ్రెయిన్‌ కు ఆప‌రేష‌న్ చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ భాగానికి మ‌త్తు మందు ఇచ్చారు. ఇక ఆ త‌ర్వాత త‌మ చేతుల్లో క‌త్తులు ప‌ట్టుకున్న వైద్యులు... ఆ టెక్కీ చేతిలో మాత్రం గిటార్‌ ను పెట్టేశారు. మా ప‌ని మేం చేస్తాం... నీవు మాత్రం గిటార్ వాయిస్తూనే ఉండాలి సుమా అంటూ అత‌డికి చెప్పార‌ట‌. వైద్యుల మాట ప్ర‌కార‌మే ఆ టెక్కీ... త‌న‌కు ఆప‌రేష‌న్ జ‌రుగుతున్నా... చేతిలోని గిటార్‌ ను వాయిస్తూనే ఉన్నాడ‌ట‌. ఆప‌రేష‌న్ ముగిసిన త‌ర్వాత వైద్యులు త‌మ చేతుల్లోని సిజ‌ర్ల‌తో పాటు టెక్కీ చేతిలోని గిటార్‌ ను కూడా ప‌క్క‌న ప‌డేసి... ఆ టెక్కి తాజా ప‌రిస్థితిని ప‌రిశీలించి ఆప‌రేష‌న్ స‌క్పెస్ అయిన‌ట్లు ప్ర‌క‌టించేశారు.

అయినా మెద‌డుకు ఆప‌రేష‌న్ చేస్తూ... చేతితో గిటార్ వాయించ‌మ‌ని ఆ టెక్కీకి వైద్యులు ఎందుకు చెప్పార‌న్న విష‌యంలోకి వెళితే... మ‌నం పొంత‌న లేని విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు బోడిగుండుకు మోకాలికి మెలిక పెడ‌తారేంటి అని అంటాం క‌దా. ఇదేమీ ఊరికే ప్రాచుర్యంలోకి రాలేదు. శ‌రీరంలోన‌ని ప్ర‌తి అవ‌య‌వం, ప్ర‌తి క‌ద‌లిక కూడా మెద‌డు ఆదేశాల మేర‌కే జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలిసిందేగా. ఇదే విష‌యాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టిన వైద్యులు... టెక్కీ చేతి వేళ్లు ప‌నిచేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించేందుకు మెద‌డులోని లోపాన్ని గుర్తించారు. ఇక్క‌డ టెక్కీ గిటార్ వాయిస్తుండ‌గా, వైద్యులు అత‌డి మెద‌డులోని ఆ చ‌ర్య‌కు ప్ర‌తిస్పందిస్తున్న భాగాన్ని గుర్తించి మొత్తం వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టార‌న్న మాట‌. వింత‌గా ఉన్నా.. ఇలా ఆప‌రేష‌న్ చేసిన బెంగ‌ళూరు వైద్యులు... ఆ టెక్కీని సాధార‌ణ మ‌నిషిలా చేసేసిన వైనం నిజంగానే ఆస‌క్తిక‌రంగా ఉంది క‌దూ.