Begin typing your search above and press return to search.

రావణకాష్టంగా మారుతున్న బీఫ్ పెస్ట్

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:16 AM GMT
రావణకాష్టంగా మారుతున్న బీఫ్ పెస్ట్
X
కశ్మీర్ నుంచి కేరళ దాకా ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అతి పెద్ద వివాదం బీఫ్ పెస్ట్. గోవు పవిత్రమైనది కాబట్టి గోమాంస విక్రయాలను నిషేధించాలని ఒకవైపు సాంప్రదాయ వర్గాలు పట్టుపడుతుండగా మా ఆహార ఆలవాట్లలో జోక్యం చేసుకుంటే ఊరుకోం అంటూ మండిపడుతున్నారు బీఫ్ భక్షకులు. ఈ రెండు పరస్పర విరుద్ధ వర్గాలలో ఏ ఒక్కరూ వెనుకకు తగ్గే పరిస్థితి లేకపోవటంతో రాష్ట్రపతి, ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని హితవు చెబుతున్నా ఆవేశ కావేషాలు చెలరేగుతూనే ఉన్నాయి.

గురువారం జమ్ము కాశ్మీర్ శాసనసభ ఈ విషయంలో యుద్ధరంగాన్ని తలపించింది. స్వతంత్ర ఎమ్మెల్యే ఇంజనీర్ రషీద్ అంతకుముందు రోజు బీఫ్ పార్టీని నిర్వహించాడని మండిపడుతున్న బీజేపీ నేడు ప్రత్యక్ష చర్యకు దిగింది. కాశ్మీర్లో పాలక భాగస్వామిగా ఉన్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు గగన్ భగత్ - రాజీవ్ శర్మలు గురువారం ఉదయం అసెంబ్లీలో స్వతంత్ర్య ఎమ్మెల్యేనీ పట్టుకుని చావబాదారు. స్పీకర్ ఇంకా తన స్థానంలో కూర్చోకముందే ఈ అనూహ్య ఘటన జరగటంతో సభ నివ్వెరపోయింది.

ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్సుకు చెందిన ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని రషీద్‌ ని కాపాడారు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన ఘాతుక చర్చకు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ (బీజేపీ) లేని నిల్చుని క్షమాపణ చెప్పాలని సీఎం ఆదేశించడంతో సభలో జరిగింది దురదృష్టకరమైన ఘటన అని నిర్మల్ సింగ్ ప్రకటించారు. ఈ చర్యను తాను ఆమోదించడం లేదని అదే సమయంలో క్రితం రోజు ఇంజనీర్ రషీద్ చేసిన పని కూడా ఖండించదగిన విషయమని పేర్కొన్నారు. నిర్మల్ సింగ్ క్షమాపణ చెప్పకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు సభను వాకౌట్ చేశారు.

సీన్ కట్ చేస్తే కేరళలో శ్రీ కేరళ వర్మ కాలేజీ ప్రాంగణంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు గో మాంసంతో విందు చేసుకోవడంతో యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ఘటన విద్యార్థులలో ఆగ్రహం తెప్పించింది. కేరళ వర్మ కాలేజీలో బీఫ్ వాడకం రాష్ట్రంలోని పలు కళాశాలల్లో నిరసనలకు దారి తీసింది. ఏబీవీపీ కార్యకర్తలకు, ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తల మద్య ఘర్షణ చెలరేగింది. కానీ విద్యాసంస్థల్లో మతపరమైన ధార్మికపద్ధతులను పాటించాల్సిన అవసరం లేదని విద్యార్థులను సమర్థించిన వర్మ కాలేజీలో మహిళా ప్రొఫెసర్ దీపా నిశాంత్‌ పై చర్యలకు కాలేజీ యాజమాన్యం నడుం కట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇప్పుడు కళాశాల ప్రాంగణంలో మాంసాన్ని నిషేధించినవారు మరోసారి రుతుక్రమ సమయంలో మహిళల ప్రవేశాన్నీ నిషేధిస్తారని నిశాంత్ ఫేస్ బుక్‌ లో చేసిన కామెంట్ ఇప్పుడు ఆన్ లైన్‌ లో హల్ చల్ చేస్తోంది. అరవైవేలమంది నెటిజన్లు ఆమె ఫాలోయర్లుగా మారారు. ఇంత జరుగుతున్నా కేరళలో బీజేపీ గొడ్డుమాంసం వినియోగంపై నిశ్శబ్దంగా ఉండటం గమనార్హం.

గోమాంసాన్ని ఇంట్లో దాచి తింటున్నారనే మిషతో దేశరాజధానికి కూతవేటు దూరంలో ఉన్న దాద్రిలో ఒక ముస్లిం కుటుంబ పెద్దను హిందూ మూక దారుణంగా బాది చంపిన ఘటన దేశాన్ని కలవరపర్చింది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ఘర్షణల తీవ్రతను గమనించిన రాష్ట్రపతి, ప్రధాని మత విశ్వాసాలు, ఆహార అలవాట్లపై పరస్పర ఘర్షణలు వద్దని ప్రకటించవలసి వచ్చింది.

బీఫ్ తినడమా, నిషేధమా అనే గొడవ ఎలాగైనా ముగియనీయండి కానీ ఇతరదేశాల్లో మటుకు మన పరువు కాస్త గంగలో కలుస్తోందంటే ఆశ్చర్యం దేనికి?