Begin typing your search above and press return to search.

వారికి బతుకమ్మ చీరల పంపిణీ చేయరట!

By:  Tupaki Desk   |   23 Sep 2019 5:42 AM GMT
వారికి బతుకమ్మ చీరల పంపిణీ చేయరట!
X
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారు.. సరికొత్త పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకునే బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాన మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టటం తెలిసిందే. చీరల పంపిణీ కార్యక్రమం తొలుత రసాభాసగా మారింది.

అయితే.. ఈ పథకం అమలులో జరిగిన లోపాల్ని గుర్తించిన కేసీఆర్ సర్కారు.. ఏడాదికి ఏడాది తప్పుల్ని సరి చేసుకుంటూ.. మరింత ఎఫెక్టివ్ గా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. గతానికి భిన్నంగా ఈసారి నాణ్యమైన చీరల్ని పంపిణీ చేసేందుకు పక్కా ప్లాన వేసింది తెలంగాణ సర్కారు.

సరాసరి రూ.300లకు పైనే ఉండేలా చీరల్ని తయారు చేయించటం.. పెద్ద వయస్కులకు పెద్ద చీరల్ని సిద్ధం చేయటంతోపాటు.. దాదాపు వందకు పైగా డిజైన్లు.. ఆకర్షనీయమైన రంగుల్లో సిద్ధం చేసిన బతుకమ్మ చీరల్ని ఈ రోజు (సోమవారం) నుంచి పంపిణీ చేయాలని భావించారు. అయితే.. హుజారాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావటంతో.. సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేయనున్నారు.

ఎన్నికల కోడ్ ఉన్న సూర్యాపేట జిల్లా మినహా తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో బతుకమ్మ చీరల్ని పంపిణీ చేయనున్నారు. మహిళలకు ప్రీతిపాత్రమైన చీరను పండుగ అందుకోలేకపోవటం.. దీనికి ఎన్నికల కోడ్ కావటం కాస్తంత నిరుత్సాహాన్ని కలిగించక మానదు. అయితే.. కోడ్ ముగిసిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు.