Begin typing your search above and press return to search.

కవితక్క రిస్క్ అన్నా లైట్ తీసుకున్నారట

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:30 PM GMT
కవితక్క రిస్క్ అన్నా లైట్ తీసుకున్నారట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పేరు ప్రస్తావించినంతనే బతుకమ్మ గుర్తుకు వచ్చేసే పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదటినుంచి ఉన్నా..ఈ పండగను కవిత ప్రమోట్ చేయటం మొదలెట్టిన తర్వాత ఇదో ఉద్యమంగా మారి.. నగరాల్లో వేర్వేరు ప్రాంతాల వారుసైతం బతుకమ్మను ఆడటం అలవాటు చేసుకున్న పరిస్థితి. అంతలా బతుకమ్మను ప్రమోట్ చేసిన ఆమె..ఈసారి బతుకమ్మ కార్యక్రమాన్ని విదేశాల్లో భారీగా జరపటంపై దృష్టి సారించారు.

స్వదేశంలో బతుకమ్మకు పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన ఆమె.. విదేశాల్లోనూ ఈ పండగను ప్రమోట్ చేసేందుకు పెద్ద టూర్ చేసిన కవిత ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. పలు దేశాల్లో పర్యటించి.. అక్కడి తెలంగాణ వారితో కలిపి ఆమె జరిపిన బతుకమ్మ వివరాల్ని వెల్లడించారు. విదేశాల్లో బతుకమ్మకు అద్భుతమైన ఆదరణ ఉందని.. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. అక్కడి వారి ఉత్సాహం చూస్తే.. తనకు సైతం కొత్త శక్తి వచ్చిందన్న ఆమె.. దుబాయ్ ఘటనను ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

ఆ దేశంలో పరిమితులు ఎక్కువని.. వేరే దేశస్తుల సంస్కృతుల ప్రదర్శన పైనా పరిమితులు ఉంటాయని.. అయినప్పటికీ అలాంటి ఇబ్బందుల్ని అధిగమించి మరీ బతుకమ్మ ఆడేందుకు ఉత్సాహాన్ని చూపారన్నారు. అక్కడి రూల్స్ కఠినంగా ఉండటంతో పాటు.. ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఎందుకింత రిస్క్ చేస్తున్నారని తాను అడిగానని.. ఏం ఫర్లేదంటూ బతుకమ్మను ఆడారాని చెప్పుకొచ్చారు. రిస్క్ తీసుకొని మరీ బతుకమ్మ ఆడటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కవిత లాంటి ధైర్యస్తురాలు.. మొండి మనిషికి సైతం రిస్క్ అనిపించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి.​