Begin typing your search above and press return to search.

ఒబామా లాస్ట్ కాల్ ఎవ‌రికంటే?

By:  Tupaki Desk   |   21 Jan 2017 9:41 AM GMT
ఒబామా లాస్ట్ కాల్ ఎవ‌రికంటే?
X
బ‌రాక్ ఒబామా... ఎమిదేళ్ల పాటు అగ్ర‌రాజ్యం అమెరికాకు అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌టిదాకా అమెరికా ఆధ్య‌క్షులుగా ప‌నిచేసిన వారికి భిన్నంగా ఒబామా పాల‌న సాగింద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అమెరికా అధ్య‌క్షుడంటే.. ప్ర‌పంచంలోని అన్ని దేశాల అధినేత‌లంద‌రికంటే ఘ‌నమైన‌వారేన‌న్న వాద‌న‌తోనే ఆ దేశ అధ్య‌క్షులంతా కాలం గడిపేశారు. అయితే ఒబామా మాత్రం ఇందుకు భిన్నం. అభివృద్ధిలో స‌త్తా చాటుతున్న వివిధ దేశాల‌ను, ఆ దేశాల అధినేత‌ల‌ను కీర్తించే విష‌యంలో ఒబామా ఏనాడూ వెనుకంజ వేయ‌లేద‌నే చెప్పాలి. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప‌లు సంద‌ర్భాల్లో ఒబామా చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి. మొన్న‌టి త‌న చివ‌రి సందేశంలోనూ ఒబామా... మోదీని గుర్తు చేసుకున్నారు. మోదీని అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన నేత‌గా, భార‌త్‌ ను అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్న నేత‌గా, ఇండో-యూఎస్ సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసిన నేతగా ఒబామా అభివ‌ర్ణించారు.

ఎనిమిదేళ్ల పాల‌నలో వైట్ హౌస్ కేంద్రంగా ఒబామా న‌డిపిన మంత్రాంగం సాంతం ఆస‌క్తిక‌ర‌మే. వైట్ హౌస్ నుంచి ఆయ‌న మోదీతో పాటు ఎన్నో దేశాల అధినేత‌ల‌కు వ‌రుస‌పెట్టి ఫోన్లు చేశారు. అయితే నిన్న‌టితో ఒబామా ప‌ద‌వీ కాలం ముగిసిపోయింది. గ‌డ‌చిన న‌వంబ‌ర్‌ లో జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన హిల్ల‌రీ క్లింట‌న్‌పై విజ‌యం సాధించిన రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌... నిన్న అమెరికా 45వ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా త‌న స‌తీమ‌ణితో క‌లిసి వైట్‌ హౌస్‌ లో అడుగుపెట్టిన ట్రంప్‌ కు ఒబామా ఎదురేగి స్వాగ‌తం ప‌లికారు. అదే స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి మిషెల్లీతో క‌లిసి ఒబామా వైట్ హౌస్‌ ను వీడారు.

వైట్ హౌస్ నుంచి ప‌లు దేశాల అధినేత‌ల‌తో మంత‌నాలు సాగించిన ఒబామా... వైట్ హౌస్‌ను వీడుతున్న స‌మ‌యంలో చివ‌ర‌గా ఎవ‌రితో మాట్లాడార‌న్న ఆస‌క్తి అందరిలోనూ నెల‌కొంది. దీనికి తాజాగా స‌మాధానం వ‌చ్చేసింది. వైట్‌ హౌస్ ను వీడే ముందు ఫోన్ తీసుకున్న ఒబామా... నేరుగా జ‌ర్మనీ ఛాన్సెల‌ర్ ఎంజెలా మెర్కెల్‌ కు ఫోన్ చేశార‌ట‌. ప్ర‌పంచంలోనే ప‌వ‌ర్ ఫుల్ లేడీగా పేరు గాంచిన మెర్కెల్‌కు ఫోన్ చేసిన ఒబామా... ఆమె చాతుర్యాన్ని, పాల‌నా తీరును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తార‌ట‌. మెర్కెల్ హ‌యాంలోనే అమెరికా - జ‌ర్మ‌నీ దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డ్డాయ‌ని కూడా ఒబామా వ్యాఖ్యానించార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/