బడా వ్యాపారి డ్యాన్సర్ మోజు.. కోట్లకు చిల్లు!

Sun Jul 22 2018 10:06:18 GMT+0530 (IST)

మనుషుల్ని నమ్మే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడొచ్చిన మార్పే ఏమంటే.. ఎవరిని ఎవరూ నమ్మలేని పరిస్థితి. లెక్క తేడా రావటానికి ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ గా నమ్మేస్తే చాలు. గతంలో స్నేహానికి.. బంధాలకు మధ్య భావోద్వేగ బాండేజ్ ఉండేది. ఇప్పుడలాంటివేమీ లేవు.ఈ విషయాల్ని మర్చిపోవటం.. మోజుతో పడిన కక్కుర్తి బెంగళూరుకు చెందిన బడా వ్యాపారికి చుక్కలు కనిపిస్తున్నాయి. చక్కటి భార్య.. ముచ్చటైన పిల్లలు ఉన్న వేళ.. ఒక బార్ డ్యాన్సర్ మోజులో పడిన ఆయనకు మనశ్శాంతి మిస్ కావటమే కాదు.. కోట్ల రూపాయిలకు చిల్లుపడిన వైనం తాజాగా బయటకు వచ్చింది. సదరు బడా వ్యాపారి వివరాలు బయటకు వెల్లడించకపోయినా.. అతగాడి అనుభవం వింటే అవాక్కు కావాల్సిందే.

బెంగళూరుకు చెందిన ఒక శానిటరీవేర్ వ్యాపారి బిజినెస్ ఫుల్ జోష్ లో నడుస్తోంది. వ్యాపారంలో వస్తున్న లాభాల నేపథ్యంలో ఒక పార్టీ ఇచ్చాడు. ఇందుకోసం ఒక బార్ కు వెళ్లాడు. ఇదంతా జరిగింది 2016లో. అక్కడ ఒక బార్ డ్యాన్సర్ ను చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెను చూసేందుకు తరచూ బార్ కి వెళ్లేవాడు. వెంట ఖరీదైన బహుమతుల్ని తీసుకెళ్లేవాడు.

బడా వ్యాపారి కక్కుర్తిని గుర్తించిన సదరు డ్యాన్సర్ తెలివిగా వ్యవహరించింది. అతడిపై తనకు ఇష్టం ఉన్నట్లుగా ఉండేది. ఇంకేముంది.. అంకుల్ ఆనంతం అంతా ఇంతా కాదు. తన దెబ్బకు అందమైన బార్ డ్యాన్సర్ పడిందని తెగ సంతోషపడిపోయేవాడు. ఇద్దరూ కలిసి రహస్యంగా ఉన్న సమయంలో సదరు డ్యాన్సర్ పక్కా ప్లాన్ తో అతగాడిని బుక్ చేసింది.

డ్యాన్సర్ కు ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సంపన్న వ్యాపారి కక్కుర్తి ముచ్చట తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పిన డ్యాన్సర్.. ఇద్దరూ కలిసి అతగాడి నుంచి భారీగా డబ్బు కొట్టేయటానికి పెద్ద ప్లాన్ వేశారు.వ్యాపారితో తాను సీక్రెట్ గా ఉండేవేళ.. రహస్యంగా కెమేరాను పెట్టేసి.. అతగాడి కక్కుర్తి ఆనందాన్ని రికార్డు చేసేసింది. అక్కడి నుంచి వ్యాపారికి చుక్కలు కనిపించటం మొదలైంది.

తన సీక్రెట్ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు ఇప్పటివరకూ రూ.2.5కోట్లు చెల్లించాడు. అయినప్పటికీ బార్ డ్యాన్సర్.. ఆమె బాయ్ ఫ్రెండ్ వదల్లేదు. తమ దగ్గరున్న వీడియోను పర్మినెంట్ గా ఇచ్చేయాలంటే రూ.50 లక్షలు ఇస్తే ఇష్యూ సెటిల్ అవుతుందన్న ఆఫర్ ఇచ్చారు. అంత చేసినా తన సమస్య పరిష్కారం అవుతుందో లేదోనన్న భయంతో స్థానికంగా ఉన్న మహిళా సంఘాన్ని ఆశ్రయించి సలహా కోరాడు. వారేమో పోలీసుల వద్దకు వెళ్లమన్నారు. స్టేషన్ గడప తొక్కితే.. విషయం ఇంట్లో తెలిస్తే కొంప కొల్లేరు అవుతుందన్న భయంతో వణుకుతున్నాడట. డ్యాన్సర్ పట్ల వ్యాపారి కక్కుర్తి ఎన్ని తిప్పలు తెచ్చి పెట్టిందో కదూ!