Begin typing your search above and press return to search.

బ్యాంకుల క‌ష్టాల‌కు బాబే కార‌ణ‌మా...?

By:  Tupaki Desk   |   29 Nov 2016 7:30 PM GMT
బ్యాంకుల క‌ష్టాల‌కు బాబే కార‌ణ‌మా...?
X
నోట్ల ర‌ద్దు అనంత‌రం ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుండ‌డంతో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దే పేరుతో ఏపీ సీఎం చంద్ర‌బాబు బ్యాంక‌ర్ల‌తో నిర్వ‌హించిన స‌మావేశం ఆయ‌న్ను తీవ్ర విమ‌ర్శ‌ల పాలుచేస్తోంది. ముఖ్యంగా బ్యాంకు అధికారులు బాబంటే మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే బ్యాంకుల‌ను నానా ఇబ్బందుల‌కు గురిచేసిన చంద్ర‌బాబు ఇప్పుడు తాజా ప‌రిణామాల‌కు త‌మ‌ను నిందించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా బ్యాంకు ఉద్యోగులంతా బాబును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

నిజానికి చంద్రబాబు పై ఆరంభం నుంచీ బ్యాంకర్లు ఆగ్రహంగానే ఉన్నారు. రాష్ట్రంలో నిధులు లేకుండానే... బ్యాంకుల‌ను ఏమాత్రం సంప్ర‌దించ‌కుండానే నిర్ణ‌యాలు తీసుకుని ఇప్ప‌టికే ఇబ్బందులు పెట్టార‌ని మండిప‌డుతున్నారు. చంద్రబాబు వల్ల బ్యాంకులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయ‌నీ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ‘వస్తున్నా మీకోసం’ యాత్ర సమయంలో రైతులు - డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించవద్దని ప్రకటించారు. దీనివల్ల బ్యాంకుల ఆదాయం - రుణ వ‌సూళ్లు ప‌డిపోయాయి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అయిదు సంత‌కాలూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేవే. అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆతర్వాత బ్యాంకుల్ని నిందించడం క‌రెక్టు కాద‌ని అంటున్నారు.

రైతు రుణమాఫీ - డ్వాక్రారుణమాఫీ నిర్ణ‌యాలు తీసుకునే ముందు బ్యాంకుల‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రూపాయి ఖర్చు చేయాలన్నా సవాలక్ష నిబంధనలు ఉంటాయ‌ని... అనేక స్థాయిలో అనుమతులు తీసుకోవాల‌ని... ఇవేమీ అర్థం చేసుకోకుండా ఎడా పెడా హామీలు ఇవ్వడం,వాటిని తీర్చమని బ్యాంకులపై ఒత్తిడి తేవడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. రైతులకు - డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేస్తాం, మీరు కట్టనవసరం లేదు అని బాబు చెప్పినందువల్ల వాళ్లంతా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించలేదు. దాంతో వాళ్లమీద అపరాధ వడ్డీపడి వాళ్ల బాకీలు తడిసిమోపెడయ్యాయి. వాళ్లమీద పడ్డ అదనపు వడ్డీతో పోలిస్తే చంద్రబాబు మాఫీ చేసింది చాలా తక్కువ అని ఎండ‌గ‌డుతున్నారు. బాబు హామీలను నమ్మి రైతులు - డ్వాక్రామహిళలు దారుణంగా నష్టపోయారు. ఆ ఆగ్రహం ఆయన మీదకు రాకుండా బ్యాంకుల మీదకు నెట్టడానికి ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు అని కొందరు బ్యాంకర్లు మండిపడుతున్నారు.

అంతేకాదు.... చంద్ర‌బాబు తీరుతో ఆవేద‌న‌కు గుర‌యిన బ్యాంక‌ర్లు ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు ఒత్తిళ్లపై ఆర్‌ బీఐకు ఫిర్యాదు చేసిన‌ట్లు చెబుతున్నారు. నిబంధనలు ఎలా ఉంటే అలా అనుస‌రించాల‌ని... చంద్ర‌బాబు ఆదేశాల‌ను ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ చెప్పిన‌ట్లు బ్యాంక‌ర్లు చెబుతున్నారు. తాజా ఒత్తిళ్లే కాకుండా రుణ‌మాఫీల పేరుతో బ్యాంకుల‌ను చంద్ర‌బాబు ఎంత‌గా న‌ష్ట‌ప‌రిచారు... ప‌ని ఒత్తిడి పెరిగి బ్యాంకుల రెగ్యుల‌ర్ లావాదేవీలు కూడా దెబ్బ‌తిన‌డానికి ఎలా కార‌ణ‌మ‌య్యార‌న్న‌దీ ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లార‌ని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/