కేసీఆర్ కోరుకున్న గెలుపు ఆమెకు దక్కింది!

Tue Jan 01 2019 14:28:22 GMT+0530 (IST)

119 సీట్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 105 సీట్లకు మించి తాము గెలుస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పటం.. చాలామంది ఆ విషయాన్ని కామెడీ చేసుకోవటం తెలిసింది. మీడియాతో పాటు సోషల్ మీడియా పుణ్యమా అని కుట్రపూరిత ప్రచారంతో పాటు.. తిమ్మిని బమ్మిని చేసేందుకు వేసిన కిటుకులతో కేసీఆర్ చెప్పినట్లుగా సీట్లు సాధించటం సాధ్యం కాదన్న మాట పలువురి నోట వినిపించింది. అంతేనా.. కేసీఆర్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని.. ఆయనకు మొత్తంగా 60 సీట్లు రావటమే గగనమన్న విశ్లేషణలు వినిపించాయి.అయితే.. ఇలాంటి ప్రచారానికి భిన్నంగా కేసీఆర్ చెప్పినంత కాకున్నా.. 88 సీట్లలో విజయం సాధించి ప్రత్యర్థులకు పగలే చుక్కలు చూపించారు. కేసీఆర్ తాను చెప్పినట్లుగా వందకు ఎమ్మెల్యేల సంఖ్య చేరకున్నా 88 స్థానాల్ని సొంతంగా గెలవగా.. తాజాగా కలిసిన వారు.. త్వరలో వచ్చి చేరే జంపింగ్స్ తో కారు స్కోర్ 100కు చేరుకోవటం ఖాయమని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. మన దేశానికి అనుకొని ఉండే బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న 71 ఏళ్ల షేక్ హసీనా దిమ్మ తిరిగే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలు నోట మాట రాని రీతిలో.. ఆమె తన అధిక్యతను ప్రదర్శించారు. బంగ్లాదేశ్ లో 298 ఎంపీ స్థానాలు ఉండగా.. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ కూటమి ఏకంగా 288 స్థానాల్లో విజయంసాధించింది. విపక్షం కేవలం 7 స్థానాల్లో విజయం సాధించగా.. మరో ముగ్గురు స్వతంత్రులు గెలిచారు.

కేసీఆర్ చెప్పిన రీతిలో హసీనా విజయం సాధించారని చెప్పాలి. ఇప్పటికే మూడు దఫాలుగా  బంగ్లాదేశ్ ప్రధానిగా వ్యవహరిస్తున్న హసీనా.. నాలుగోసారి ప్రధానిగా ఘన విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. ప్రతిపక్షం మళ్లీ నోరు మెదపని రీతిలో దారుణ పరాజయానికి గురి అయ్యారు. ఒక దేశ ప్రధాని మూడు దఫాలుగా అధికారంలోకి వచ్చి..  నాలుగో సారి ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించటం అంత తేలికైన విషయం కాదు.