రమ్యకు ఫ్లైట్ టికెట్ పంపిన బెంగళూరువాసి?

Fri Mar 15 2019 10:02:47 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల జాబితాలో ఆమె పేరు బలంగా వినిపిస్తూ ఉంటుంది. పార్టీకి సంబంధించిన కీలకమైన సోషల్ మీడియా విబాగాన్ని నడిపిస్తున్న కర్ణాటక మాజీ ఎంపీ.. సినీ నటి రమ్యకు ఊహించని షాక్ ఎదురైంది. కీలకమైన ఎన్నికల వేళ.. ప్రత్యర్థులపై పిడుగుల్లాంటి పోస్టులను సంధించే ఆమెకు.. ఉక్కిరిబిక్కిరి చేసే పోస్ట్ ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.మాండ్య మాజీ ఎంపీగా ఉన్న రమ్య.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవటం.. ఆమె ఢిల్లీలోనే ఉండిపోవటం.. ప్రధాని మోడీపై తరచూ ఘాటు విమర్శలు చేసేలా పోస్టులు పెట్టిస్తున్న ఆమె తీరుకు పంచ్ విసురుతూ బెంగళూరు వాసి ఒకరు చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రమ్య అలియాస్ దివ్య స్పందనకు ఊహించని రీతిలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు బెంగళూరుకు చెందిన సామాన్యుడు ఒకరు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో?  లేదో?  అన్న విషయాల్ని చెక్ చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జాబితాలో లేని వారు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. యూత్ కు ఓటు ప్రాధాన్యం మీద ప్రచారం చేస్తున్న ఆమె.. ముందు తన ఓటు ఉందో? లేదో?  చూసుకోవాలంటూ బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి ఫ్లైట్ టికెట్ ను రమ్య పేరుతో బుక్ చేశారు. ఓటు ప్రాధాన్యం మీద ప్రచారం చేస్తున్న రమ్య.. ఈసారి ఎన్నికల సందర్భంగా అయినా ఢిల్లీ నుంచి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.

ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి మాండ్యకు ఫ్లైట్ టికెట్ తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సోషల్ మీడియా బాధ్యతల్ని చేపట్టి.. స్థానికంగా అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా పోస్ట్ వైరల్ గా మారింది.