Begin typing your search above and press return to search.

సురేశ్ ప్రభు.. సుష్మా బాటలో ఇప్పుడు దత్తన్న

By:  Tupaki Desk   |   23 Oct 2016 5:17 AM GMT
సురేశ్ ప్రభు.. సుష్మా బాటలో ఇప్పుడు దత్తన్న
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి దృష్టికి తమ సమస్యల్ని తీసుకెళ్లటం గతంలో చాలా కష్టంగా ఉండేది. సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా.. వారి దృష్టికి ఏదైనా విషయాన్ని తీసుకెళ్లటానికి చిన్న ట్వీట్ సరిపోయే పరిస్థితి. ట్విట్టర్ వేదికగా చేసుకొని.. దేశ ప్రజలకు పెద్ద ఎత్తున సాయం చేస్తున్న కేంద్రమంత్రులుగా రైల్వే శాఖామంత్రి సురేశ్ ప్రభు.. విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ లు ముందుంటారు. ఇప్పుడు వారి సరసనే మన దత్తన్న చేరారని చెప్పాలి.

తాజాగా ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన సమస్యను ట్వీట్ రూపంలో దత్తన్న కు పోస్ట్ చేయగా.. ఆయన స్పందించి.. అధికారులకు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఒక చిన్నారి ప్రాణాలు నిలిచాయి. ఢిల్లీకి చెందిన చందన్ సింగ్ కు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అతడికి గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆపరేషన్ కానీ చేయకుంటే ప్రాణాలు నిలిచే అవకాశమే లేదు. చిల్లి గవ్వ చేతిలో లేని చందన్ సింగ్ కు.. ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేయించాలని సతమతం అవుతున్న వేళ.. అతడు ఈఎస్ ఐ ఆసుపత్రిని సంప్రదించాడు. తాను కార్మికుడ్ని కావటంతో తన కుమారుడికి చికిత్స చేయాలని అక్కడి వైద్యుల్ని కోరారు. అయితే.. ఈఎస్ ఐ ఆసుపత్రుల వైద్యులు ఆపరేషన్ చేసేందుకు నిరాకరించారు. దీంతో.. ఈ మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ చందన్ సింగ్ స్నేహితుడు ఒకరు.. ఒక ట్వీట్ తో మొత్తం విషయాన్ని కేంద్ర కార్మిక శాఖామంత్రి దత్తన్న ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

దీనికి స్పందించిన దత్తన్న.. వెంటనే ఆ చిన్నారికి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలంటూ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం చిన్నారికి సరైన సమయంలో ఆపరేషన్ చేయటంతో ప్రాణాలు నిలిచాయి. సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు.. వారి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మరో కేంద్రమంత్రి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నారన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/