Begin typing your search above and press return to search.

బ‌నార‌స్ క్వ‌శ్చ‌న్‌!..ఆవుల కంటే మేం తీసిపోయామా?

By:  Tupaki Desk   |   25 Sep 2017 12:21 PM GMT
బ‌నార‌స్ క్వ‌శ్చ‌న్‌!..ఆవుల కంటే మేం తీసిపోయామా?
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలోని ప్ర‌ఖ్యాత బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యంలో ఇప్పుడు నిశ్చ‌బ్దం రాజ్య‌మేలుతోంది. నిత్యం విద్యార్థుల‌తో క‌ళ‌క‌ళ‌లాడే ఆ వ‌ర్సిటీ ప్రాంగ‌ణం... ద‌స‌రా సెల‌వుల‌కు ముందే మూగ‌బోయింద‌ని చెప్పాలి. దేశ‌ - విదేశాల‌కు చెందిన వేలాది మంది విద్యార్థుల‌తో నిత్యం సంద‌డిగా క‌నిపించే ఆ వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలో ఇప్పుడు ఖాకీల బూట్ల శ‌బ్దాలే వినిపిస్తున్నాయ‌ట‌. ఇందుకు కార‌ణాలేమిట‌న్న ప్ర‌శ్న‌కు వ‌స్తే... స‌మాధానం మాత్రం ప్ర‌ధాని మోదీ - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం ఆదిత్య‌నాథ్ యోగీ మాత్ర‌మే చెప్పాల‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా అక్క‌డేం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... వ‌ర్సిటీలో విద్యార్థినీల‌పై ఇటీవ‌లి కాలంలో లైంగిక వేధింపుల‌తో పాటు లైంగిక దాడులు నిత్య‌కృత్యంగా మారాయట‌. సాక్షాత్తు ప్ర‌ధాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజక‌వ‌ర్గంలోని ప్రతిష్ఠాత్మ‌క వ‌ర్సిటీలోనే ఈ త‌ర‌హా వేధింపులు జ‌రిగితే... తాము ఎవ‌రికి చెప్పుకోవాల‌ని ఆ వ‌ర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మొన్న శ‌నివారం వార‌ణాసి ప‌ర్య‌ట‌న‌కు మోదీ వ‌స్తున్నార‌ని, మోదీ ప‌ర్య‌ట‌న కూడా త‌మ వ‌ర్సిటీ మీదుగానే ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలుసుకున్న విద్యార్థులు... త‌మ స‌మ‌స్య‌ల‌ను మోదీ ముందు పెట్టాల్సిందేన‌ని భావించారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు కూడా ర‌చించుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న యూపీ పోలీసులు... ఎక్క‌డ త‌మ ప‌రువు పోతుందోన‌న్న భావ‌న‌తో విద్యార్థుల నోళ్ల‌ను నొక్కేయాల్సిందేన‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందుకు యోగీ కూడా త‌లూపేయ‌డంతో బ‌నార‌స్ వ‌ర్సిటీ చుట్టూ పోలీసుల క‌వాతు ప్రారంభ‌మైపోయింది. అంతేకాకుండా విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగితే... ఎక్క‌డ గొడ‌వ జ‌రుగుతుందోనన్న భావ‌న‌తో ఏకంగా మోదీ టూర్ రైట్ మ్యాప్‌నే యూపీ పోలీసులు మార్చేశారు. అయినా కూడా బ‌నార‌స్ విద్యార్థులు త‌మ గొంతుక‌ను విప్పారు. ఫ‌లితంగా పోలీసు లాఠీలు వారిపై నాట్యం చేశాయి. ఈ దృశ్యాల‌ను సెల్‌ ఫోన్ల‌లో చిత్రీక‌రించిన కొంద‌రు విద్యార్థులు స‌ద‌రు వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడా వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మార‌గా... విద్యార్థుల‌పై విచ‌క్షణార‌హితంగా దాడికి దిగిన పోలీసుల‌పై చ‌ర్య‌ల‌కు ఆదేశాలు జారీ చేయాల్సిన యోగీ... ఆ బాధ్య‌త‌ను మ‌రిచి అస‌లు వీడియోలు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వారెవ‌రో ఆరా తీసి వారిని బొక్క‌లో తోయండంటూ ఆదేశాలు జారీ చేశార‌ట‌. ఈ మొత్తం వ్య‌వ‌హారం తెలిసినా కూడా మోదీ క‌నీసం నోరు కూడా విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ త‌తంగంపై ఇప్పుడు బ‌నార‌స్ విద్యార్థులు ఆవేద‌న‌తో కూడిన పోరాటానికి దిగారు. ఫ‌లితంగా వ‌ర్సిటీకి ద‌స‌రా సెల‌వులు ప్రారంభానికి మూడు ముందే సెల‌వులొచ్చేశాయట‌. ఉన్న ప‌ళంగా హాస్ట‌ళ్ల‌ను ఖాళీ చేయాలంటూ బ‌నారస్ విద్యార్థుల‌కు ఆదేశాలు జారీ అయ్యాయ‌ట‌. దీనిపై మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విద్యార్థులు నేరుగా ప్ర‌ధానినే టార్గెట్ చేస్తూ నాన్ స్టాప్ పోరాటానికి తెర తీశారు. ఇంత గొడవ జరుగుతున్న ప్రధాని మోదీ తమ భద్రత గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అన్యాయమని యూనివర్శిటీ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీంతో మోదీ కూడా మగాళ్ల ఆధిపత్యవాదన‌నే అనుస‌రిస్తున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు.

శనివారమంతా ఆవుల ఆరోగ్య పరీక్షలను పర్యవేక్షిస్తూ మూగజీవుల హక్కులను పట్టించుకున్న మోదీ - నోరు విప్పి హక్కుల గురించి మాట్లాడుతున్న తమ గురించి ఎందుకు పట్టించుకోరని, ఓటు హక్కులేని ఆవులకంటే ఓటు హక్యు, రాజ్యాంగ హక్కులు కలిగిన తాము తీసిపోయామా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇజ్జత్‌ ఘర్‌ నినాదంతో మహిళల మానరక్షణకు మరుగుదొడ్లు అత్యవసరమంటూ చెబుతున్న మోదీ, తమ మాన, ప్రాణాల మీద జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోరని విద్యార్థి నాయకురాలు వందనా సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే... విద్యార్థినులపై పోలీసులు జరిపిన పాశవిక దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ ‘బీహెచ్‌ యూ బజ్‌’ పేరిట సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. మ‌రోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఆదిత్యనాథ్‌ యోగికి పరిపాలనలో పరిణితి లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్లనే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.