Begin typing your search above and press return to search.

అమ్మాయిలంతా గుండు కొట్టించుకున్నారు

By:  Tupaki Desk   |   24 Sep 2017 9:39 AM GMT
అమ్మాయిలంతా గుండు కొట్టించుకున్నారు
X
మ‌హిళ‌ల రక్ష‌ణ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇలాకాలో క‌ల‌కలం రేగుతోంది. అందంగా ఉన్నార‌ని అమ్మాయిల‌ను లైంగికంగా వేధిస్తుండ‌టంతో విద్యార్థినులు గుండు కొట్టించుకుంటున్నారు! కొత్త త‌ర‌హాలో నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. `గంగామాత పిలిస్తే వారణాసి వచ్చిన మోడీ....ఇప్పుడు ఆ మాత బేటీలం పిలుస్తున్నాం... మా వర్సిటీకి రండి.. మా సమస్యలు స్వయంగా తెలుసుకోండి.. మాకు రక్షణ కల్పించండి..`` అంటూ విద్యార్థినులు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇది బనారస్ హిందూ యూనివర్సిటీలో ప‌రిస్థితి. గురువారం రాత్రి నుంచి ఈ క్యాంప‌స్‌ ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్టూడెంట్స్‌పై పోలీసులు పదేపదే లాఠీచార్జ్ చేశారు. విద్యార్థినులపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే....ఫైన్‌ ఆర్ట్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని గ‌త గురువారం సాయంత్రం ఆరుగంటల సమయంలో హాస్టల్‌ బయట ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బైక్‌ మీద ఉన్న వారు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె వర్సిటీ ప్రోక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు అతని కార్యాలయానికి వెళ్ళింది. కాగా, ప్రోక్టర్‌ ఆమెనే తప్పుపడుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గంటల తర్వాత బయటకు రావడమేంటని ప్రోక్టర్‌ ఆమెనే తప్పుపట్టారు. వెంటనే అక్కడి నుంచి హాస్టల్‌కు చేరుకున్న ఆమె సహచర విద్యార్థులకు విషయం చెప్పింది. అదే రోజు అర్ధరాత్రి నుంచి వీసీ కార్యాలయం ముందు విద్యార్థులు ఆకస్మిక ఆందోళనకు దిగారు. ఆకస్మిక పరిణామంతో వర్సిటీ అధికారులు విస్తుపోతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థుల నిరసనకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన బాధితురాలి స్నేహితురాలు గుండు గీయించుకుని మరీ నిరసన వ్యక్తం చేస్తోంది. నెలకోసారి తాను గుండు గీయించుకుంటానని ఆమె అంటున్నారు. అందంగా కనిపించకుండా ఉండటానికి, వేధింపులు - ఈవ్‌ టీజింగ్‌ నుంచి కాపాడుకోవడానికి ఇదొక మార్గంగా తమకు తోస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో గత మూడు రోజులుగా బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌ యూ) అట్టుడుకుతోంది. ఈ యూనివర్సిటీలో ఇంత ఎద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళనలకు దిగడం ఇదే ప్రథమం. ప్రధాని మోడీ వారణాసి పర్యటనలో ఉండగా.. విద్యార్థులు ఆందోళనలు ఉధృతమయ్యాయి. వారణాసిలో ఉన్న మోడీ వర్సిటీకి రావాలని, తమ పరిస్థితి ఒక్కసారి చూడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వీసీ బయటకు రావాలనీ, మా రక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని వారు కోరుతున్నారు. విద్యార్థినిపై హాస్టల్ వద్ద లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నేపథ్యంలో విద్యార్థులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఫిర్యాదుచేసినా నిందితులపై చర్యలు తీసుకోవడంలో వైస్‌ చాన్స్‌లర్‌ విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. వైస్‌ చాన్స్‌లర్‌ను తొలగించాలని, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. క్యాంపస్‌లో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.

మ‌రోవైపు శనివారం సాయంత్రానికి కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలున్న విద్యార్థులు కూడా జత కలవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదే సమయంలో ఎవరో వాహనాన్ని తగలబెట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ జరిపినట్లు క్యాంపస్ వర్గాలు వెల్లడించాయి. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులకు మద్దతుగా వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినట్లు సమాచారం. పోలీస్ వాహనంతోపాటు కొన్ని బైకులను కూడా ఎవరో తగులబెట్టారు. లాఠీచార్జ్ తర్వాత కొందరికి గాయాలవడంతో వాళ్లను ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో క్యాంపస్ మూసేసి విద్యార్థులకు దసరా హాలిడేస్ ఇవ్వాలని భావిస్తున్నారు.