కేసీఆర్ కు షాక్..పార్టీకి జెడ్పీ చైర్మన్ గుడ్ బై

Sun Sep 23 2018 22:57:25 GMT+0530 (IST)

టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు ఊహించని ట్విస్ట్ ఇస్తున్నాయి. అనూహ్య రీతిలో ముందస్తుకు వెళ్లిన గులాబీదళపతికి అదే రీతిలో అంతర్గత కుమ్ములాటలు సతమతం చేస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎగసిపడుతునే ఉన్నాయి. అధిష్ఠానం ఊహించని విధంగా పార్టీ ముఖ్య నేతలు ఒకొక్కరూ అసమ్మతి బాట పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తి వ్యక్తం కావడం మాములేనని - నాలుగైదు రోజుల తర్వాత అంతా సర్దుకుంటుందని టీఆర్ ఎస్ అధిష్ఠానం భావించింది. అయితే అభ్యర్థులను ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా అసమ్మతి రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గేలా కనిపించక పోవడం పట్ల హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా నేతలు పార్టీని వీడేందుకు - తమ రాజకీయ భవిష్యత్ ను వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ తన పదవికి టాటా చెప్పేందుకు సిద్ధమయ్యారు. కీలకమైన నల్లగొండ జిల్లాలో ఈ పరిణామం టీఆర్ ఎస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది.టికెట్లు ప్రకటించిన జాబితాలో నల్లగొండ జెడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ కు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ తరఫున జెడ్పీ చైర్మన్ అయి టీఆర్ ఎస్ లో చేరిన ఆయన దీంతో షాక్ కు గురయ్యారు. తాజాగా కార్యకర్తలు - మద్దతునిచ్చే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు - అనుచరులతో సమావేశమైన బాలునాయక్ మాట్లాడుతూ తనను టీఆర్ ఎస్ లో అణుగదొక్కేందుకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని - అందుకే తనకు దేవరకొండ నుండి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఎంతో ప్రోత్సహించిందని - గిరిజనులకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ లో తాను ఎమ్మెల్యేగా - జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యానన్నారు. జిల్లా అభివృద్ధికి నిధుల సాధనకు తాను అధికార టీఆర్ ఎస్ లో చేరిన తనకు రాజకీయంగా చివరకు అన్యాయమే జరిగిందన్నారు. మళ్లీ తనను - గిరిజన జాతిని ఆదరించే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఈ నెల 26న తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు వారి అభీష్టం మేరకు దేవరకొండ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం టీఆర్ ఎస్ కు గుడ్ బై కొట్టి ఈ నెల 26న కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నానని జడ్పీ చైర్మన్  ప్రకటించారు.

కాగా ఇదే సామాజికవర్గానికి చెందిన మరో ముఖ్యుడు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ ఎస్ వ్యవస్థాపక సభ్యుడు - ఎమ్మెల్సీ రాములు నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి సిద్ధం అయ్యారు. రాబోయే రెండు మూడు రోజులలో రాజీనామా చేయాలని రాములు నాయక్ నిర్ణయించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేయడం టీఆర్ ఎస్ లో చర్చనీయాంశంగా మారింది.