Begin typing your search above and press return to search.

బాల‌య్య అల్లుళ్లు... కోఆర్డినేష‌న్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   15 Jun 2019 7:32 AM GMT
బాల‌య్య  అల్లుళ్లు... కోఆర్డినేష‌న్ అదుర్స్‌
X
టాలీవుడ్ టాప్ హీరో, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నేత నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి కో ఆర్డినేష‌న్ ఉంద‌నే చెప్పాలి. పెద్ద‌ల్లుడు నారా లోకేశ్... టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా ఏపీ శాస‌న మండ‌లిలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఇక చిన్న‌ల్లుడు శ్రీభ‌ర‌త్‌... తాజా ఎన్నిక‌ల్లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో బాల‌య్య గెలిస్తే... ఆయ‌న అల్లుళ్లిద్ద‌రూ ఓట‌మి పాల‌య్యారు. ఓట‌మి భారంతో ఇద్ద‌రు అల్లుళ్లు అస్స‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు.

చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న క్లోజ్ డ్ డోర్ మీటింగుల‌కు లోకేశ్ హాజ‌ర‌వుతున్నా... శ్రీ‌భ‌ర‌త్ మాత్రం అస్స‌లు క‌నిపించ‌డం లేదు. గీతం వ‌ర్సిటీ అధినేత‌గా ఉన్న‌ప్ప‌టికీ కూడా ఓట‌మి భారంతో ఆయ‌న బ‌య‌ట క‌నిపించ‌డ‌మే లేదు. అయితే నిన్న ఉన్న‌ట్టుండి బాల‌య్య అల్లుళ్లిద్ద‌రూ ఒకే స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఏపీ శాస‌న‌స‌భ, మండ‌లి ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగానికి లోకేశ్ హాజ‌రు కాగా... అటు వైపు శ్రీ‌భ‌ర‌త్ కూడా విశాఖ‌లో మీడియా ముందుకు వ‌చ్చారు. నిజంగానే ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని, మాట్లాడుకుని మ‌రీ ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టుగా ఉంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ సంద‌డి చేసి త‌న‌లోని న‌యా స్టైల్ ను చూపిస్తే... శ్రీభ‌ర‌త్ మాత్రం త‌మ ఓట‌మికి క్రాస్ ఓటింగే కార‌ణ‌మంటూ త‌న‌దైన శైలి వ్యాఖ్య చేశారు.

ఓ వైపు త‌మ ఓట‌మిని కార‌ణాలేమిటో అర్థం కావడం లేద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు చెబుతుంటే... భ‌ర‌త్ మాత్రం టీడీపీ ఓట‌మికి క్రాస్ ఓటింగే కార‌ణ‌మంటూ తేల్చేయ‌డం గ‌మ‌నార్హం. స‌రే... బాల‌య్య అల్లుళ్లిద్ద‌రూ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో బ‌య‌ట‌కు వ‌స్తే... వీరిద్ద‌రి మ‌ధ్య కోఆర్డీనేష‌న్ బాగానే ఉందంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఓడినా కూడా ఇద్ద‌రూ కూడ‌బ‌లుక్కుని బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఒకే ముహూర్తాలు పెట్టుకున్నారంటూ కూడా కొంద‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.