Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో ఒక్క‌టైన బాల‌య్య‌-హ‌రికృష్ణ‌

By:  Tupaki Desk   |   28 May 2016 11:08 AM GMT
ఆ విష‌యంలో ఒక్క‌టైన బాల‌య్య‌-హ‌రికృష్ణ‌
X
అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. రాజకీయంగా ఒకే ర‌కమైన ఆశయంతో ఉన్నా.. వేర్వేరు కార‌ణాల‌తో విడిపోవాల్సి వ‌చ్చింది. ఒక‌రు పార్టీ అధినేత‌కు ద‌గ్గ‌ర‌వుతున్న కొద్దీ.. మ‌రొక‌రు పార్టీకి దూరంగా ఉండిపోతున్నారు. ఆ అన్న‌ద‌మ్ములే.. విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యులు హ‌రికృష్ణ‌ - బాల‌కృష్ణ‌! తాము దూరంగా ఉన్నా.. త‌మ ఆలోచ‌న‌లు - భావాలు ఒక్క‌టే అని మ‌రోసారి వీరు నిరూపించారు. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు! ఒక‌రు మ‌హానాడు వేదిక‌గా హోదా గురించి మాట్లాడితే.. మ‌రొక‌రు ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద తెలుగు ప్ర‌జ‌ల అంత‌రంగాన్ని ఆవిష్క‌రించే ప్రయ‌త్నం చేశారు.

ప్ర‌త్యేక‌హోదా అంశం మ‌హానాడులో చ‌ర్చ‌కు వేదికైంది. ఆనాడు ఇస్తామ‌ని చెప్పిన నేత‌లే.. ఇప్పుడు లేదు ఇవ్వబోమ‌ని స్ప‌ష్టంచేసేశారు. దీనిపై తెలుగు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. మ‌ళ్లీ ప్ర‌త్యేక‌హోదా గురించి ఉద్య‌మాలు వచ్చేలా ఉన్నాయి ప‌రిస్థితులు! అయితే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాల్సిదేనని నంద‌మూరి హ‌రికృష్ణ‌ - బాల‌కృష్ణ‌.. డిమాండ్ చేశారు. అన్న నిర‌స‌న గ‌ళంతోనూ.. త‌మ్ముడు సామ‌ర‌స్య‌పూర్వ‌క ధోర‌ణితోనూ ఎవ‌రి పంథాలో వారు కేంద్రాన్ని కోరారు. మ‌హానాడులో ఎన్టీఆర్‌ పై ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానంలో.. బాల‌కృష్ణ మాట్లాడుతూ.. ప్ర‌త్యేకహోదాపై తాను బీజేపీతో మాట్లాడతాన‌ని చెప్పారు. అనంత‌రం ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ.. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.

ఇక మ‌హానాడుకు గైర్హాజ‌రై.. ఎన్టీఆర్ కు నివాళుల అర్పించేందుకు ఆయ‌న ఘాట్‌ కు వ‌చ్చిన హ‌రికృష్ణ మాట్లాడుతూ.. ప్ర‌త్యేకహోదా కోసం ఉద్య‌మించాల్సిందేన‌ని పిలుపునిచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇచ్చిన నాడే.. ఆయ‌న‌కు స‌రైన నివాళి అని పేర్కొన్నారు. మ‌రి అన్న‌ద‌మ్ములూ ఒకే గ‌ళం వినిపించ‌డం మంచి ప‌రిణామ‌మే! వీరి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా విబేధాలున్నా ప్ర‌త్యేక హోదా విష‌యంలో మాత్రం ఇలా ఒక్క‌ట‌య్యారు.