Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు సీఎంల‌ను చూస్తే సంతోషంగా వుంది

By:  Tupaki Desk   |   22 Jun 2017 2:49 PM GMT
ఇద్ద‌రు సీఎంల‌ను చూస్తే సంతోషంగా వుంది
X
తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - కే చంద్ర‌శేఖర్ రావుపై సినీన‌టుడు - టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను చూస్తుంటే త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నారు. ఇరు రాష్ర్టాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయ‌ని ప్ర‌శంసించారు. హైద‌రాబాద్‌ లోని నంద‌మూరి బ‌స‌వ‌తారక ఆస్ప‌త్రి 17వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో బాల‌కృష్ణ పాల్గొని ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

నాన్న గారి స‌న్నిహితులైన ఇద్దరు చంద్రులు చంద్రబాబు - కేసీఆర్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్ప‌త్రి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని బాల‌కృష్ణ సంతోషం వ్య‌క్తం చేశారు. ఆస్పత్రిలో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సాహం - చేయూత ఇస్తుండటం ఆ సంస్థ ఛైర్మన్‌ గా తనకెంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఇరు రాష్ర్టాలు ఇలాగే అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించారు. అతి త్వరలోనే హాస్పిటల్ లో టొమోగ్రఫీని ప్రారంభిస్తామ‌ని బాల‌య్య ప్ర‌క‌టించారు. కాన్సర్ ఉన్న వారు బసవతారకం లోకి అడుగుపెట్టగానే నయం ఆవుతుందని బాల‌య్య అన్నారు. దేశంలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ మొదటి స్థానంలో ఉందని, ఈ ఆస్ప‌త్రిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని బాల‌కృష్ణ‌ ప్ర‌క‌టించారు. త్వరలో ఏపీలో బసవతారకం హాస్పిటల్ నిర్మిస్తామ‌ని తెలిపారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాట్లాడుతూ బసవతారకం ఆస్ప‌త్రికి ద‌క్కిన గుర్తింపు సమష్టి విజయమ‌ని అన్నారు. ఇది 17వ వార్షికోత్సవం అయినా 25 ఏళ్ల‌ ప్రయాణమ‌ని తెలిపారు. బసవతారకం అనగానే అన్న ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, ఆయన స్ఫూర్తి - కృషి - పట్టుదలే ఇంత దూరం వచ్చిందని తెలిపారు. బసవతారకం హాస్పిటల్ కి గుర్తింపు తెచ్చింది చంద్రబాబు అని వివ‌రించారు. బయట ఆస్ప‌త్రులు వైద్యానికి లెక్కలు వేసుకుంటాయి..కానీ బసవతారకం లెక్కలు లేకుండా ఖర్చు చేసి మంచి పేరు తెచ్చుకుందని వివ‌రించారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్ప‌త్రికి అన్ని రకాలుగా సహాయం అందిస్తోంద‌ని స్పీక‌ర్ కోడెల ప్ర‌శంసించారు. ఇరు రాష్టాల వైద్యశాఖల మంత్రులు అభివృద్ధి లో పోటీ పడుతున్నారని కితాబిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/