Begin typing your search above and press return to search.

బావ మీద బాలయ్య ప్రశంసల జల్లు

By:  Tupaki Desk   |   2 Dec 2016 2:01 PM GMT
బావ మీద బాలయ్య ప్రశంసల జల్లు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద ఆయన బావమరిది.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అంటూ బావను ఆకాశానికెత్తేశారు బాలయ్య. శుక్రవారం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేశారు. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు నీటిని కిందికి విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో బాలయ్య మాట్లాడుతూ.. గొల్లపల్లి రిజర్వాయరుకు నీరు విడుదల చేయడంతో ఎన్టీఆర్‌ కల నెరవేరిందన్నారు. అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలున్నా.. నీరు లేకపోవడంతో రాయలసీమ వెనకబడిపోయిందని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు సంకల్పం వల్ల కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లా కూడా సస్యశ్యామలం అవుతోందని బాలయ్య చెప్పారు. హిందూపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/