Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో బాల‌య్య రెచ్చిపోయాడుగా!

By:  Tupaki Desk   |   16 Aug 2017 8:32 AM GMT
నంద్యాల‌లో బాల‌య్య రెచ్చిపోయాడుగా!
X
నంద్యాల ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ముంచుకొస్తోంది. వైసీపీ - టీడీపీలు ఎవ‌రి ప్ర‌చారాన్ని వారు హోరెత్తిస్తున్నారు. ఇక‌, బుధ‌వారం టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చార ప‌ర్వంలోకి కాలు పెట్టిన చంద్ర‌బాబు వియ్యంకుడు - హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న డైలాగుల‌తో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు దిగారు. తూటాల‌తో బుద్ధిచెప్పాలంటూ.. వైసీపీపై విరుచుకుప‌డ్డారు. అంతేకాదు, శిల్పా బ్ర‌ద‌ర్స్ త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ర‌కం అంటూ నానా దుర్భాష‌ల‌కు దిగారు. తాము ఎంత‌గానో ప్రేమగా చూసినా .. పార్టీని విడిచిపెట్టి వైసీపీ పంచ‌న చేరాడ‌ని అన్నారు. దీంతో ఇప్పుడు బాల‌య్య వ్యాఖ్య‌లపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశార‌ని, చంద్ర‌బాబును తిట్టార‌ని ప‌దే ప‌దే విరుచుకుప‌డుతున్న టీడీపీ ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి శిల్పా త‌ల్లిపాలు తాగి రొమ్ముగుద్దార‌ని బాల‌య్య అంటున్నారు. అయితే, మ‌రి భూమా అఖిల కానీ, ఆమె తండ్రికానీ చేసింది ఏమిటో కూడా బాల‌య్య చెబితే బాగుంటుంది క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. 2014లో భూమా కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటే 2016లో జ‌గ‌న్‌ ను కాద‌ని చంద్ర‌బాబు చూపిన మంత్రి ఆశ‌తో భూమా మ‌రి పార్టీ మార‌లేదా? అప్పుడు దానిని ఏమంటారు? ఇక‌, క‌నీసం శిల్పా అయినా నైతిక‌త పేరుతో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ కండువా క‌ప్పుకొన్నార‌ని నంద్యాల ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

న్యాయం, అన్యాయం మ‌ధ్య పోటీ జ‌రుగుతోంద‌ని చెబుతున్న బాల‌య్య‌.. 20 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను గంప‌ గుత్తుగా ఆశ‌లు చూపించి పార్టీలో చేర్చుకోవ‌డం న్యాయమా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, బాల‌య్య మాట్లాడిన ప్ర‌తి మాట‌లోనూ తప్పులే క‌నిపిస్తున్నాయ‌ని వైసీపీ నేత‌లు దుయ్య‌బ‌డుతున్నారు. అంతేకాకుండా బాల‌య్య నోటికి వ‌చ్చిన‌ట్లు ఇష్టానుసారంగా మాట్లాడాడ‌ని కూడా అంటున్నారు. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు అనే తూటాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన‌డం, వారివి హంస మాట‌లు, కోతి చేష్ట‌లు అని తీర్మానించ‌డాన్ని వైసీపీ నేత‌లు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. బాలయ్య నోట ఏమ‌న్నా మంచి ప‌లుకులు వ‌చ్చాయా? అని వారు టీడీపీని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే బాల‌య్య ప్ర‌చారం టీడీపీకి ప్ల‌స్ అవుతుంద‌ని అనుకున్న నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే అవన్నీ ఆవిరైపోయాయి. గోల్డెన్ లెగ్ అవుతాడనుకున్న బాల‌య్య‌.. ఐరెన్‌లెగ్‌లా మారిపోయాడు.

త‌న బావ‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు అభ్య‌ర్థ‌న‌తో నంద్యాల‌లో ప్ర‌చారానికి సిద్ధ‌మైపోయాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఇప్ప‌టికే 25 మంది ఎమ్మెల్యేలు - మంత్రులు అక్క‌డే ప్ర‌చారం చేస్తున్నా.. ఇవి ఏమాత్రం ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక పోవ‌డంతో చివ‌రికి బాల‌య్యను కూడా రంగంలోకి దించేశారు చంద్ర‌బాబు!! అయితే బాల‌య్య ఎంట్రీ ప‌వ‌ర్ ఫుల్‌ గా ఉంటుంద‌ని భావించినా.. ఇప్పుడు అంతలా క‌నిపించ‌డం లేద‌ట‌. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. బుధవారం బాలకృష్ణ రోడ్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే అపశృతి చోటు చేసుకుంది.

బాలయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ లోని ఓ వాహనం ఓ బాలుడిని ఢీకొట్టింది. దీంతో గాయపడ్డ బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు స్వల్పంగా గాయపడ్డాడని - చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రమాదమేమీ లేదని చెప్పారు. అయితే బాల‌య్య ప్ర‌చారం ప్రారంభించిన కొద్ది సేప‌టికే ఇలా జ‌ర‌గడంపై నేత‌లు కంగారు ప‌డుతున్నార‌ట‌. అస‌లే బాల‌య్య‌కు సెంటిమెంట్లు కూడా ఎక్కువనే విష‌యం తెలిసిందే! అంతేగాక ప్ర‌చారంలో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు కూడా వివాదాస్ప‌దంగా ఉన్నాయ‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. మొత్తానికి స‌రికొత్త ఊపు తీసుకొస్తాడ‌ని భావించిన నేత‌ల ఆశ‌ల‌న్నీ నీరుగారిపోయేలా ఉన్నాయ‌ట‌.