Begin typing your search above and press return to search.

బాల‌య్య తేల్చేశాడు.. ఎన్టీఆర్ రాడు!

By:  Tupaki Desk   |   17 Nov 2018 8:49 AM GMT
బాల‌య్య తేల్చేశాడు.. ఎన్టీఆర్ రాడు!
X
నంద‌మూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినికి కూక‌ట్‌ ప‌ల్లి టీడీపీ టికెట్ ఖ‌రారు కావ‌డంతో ప్ర‌స్తుతం ఆ సీటు ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న తండ్రికి ఘ‌నంగా అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిపించిన టీఆర్ ఎస్‌ కు వ్య‌తిరేకంగా సోద‌రి కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్ - క‌ల్యాణ్‌ రామ్ ప్ర‌చార బ‌రిలోకి దిగుతారా? లేదా? అన్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త‌మ‌కు మాట మాత్ర‌మైనా చెప్ప‌కుండానే సుహాసినిని రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చార‌ని చంద్ర‌బాబుపై హ‌రికృష్ణ కొడుకులు గుర్రుగా ఉన్నార‌నే వార్త‌లు ఈ ఆస‌క్తిని రెట్టింపు చేస్తున్నాయి.

కూక‌ట్‌ ప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థిగా సుహాసిని శ‌నివారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కుముందు త‌న బాబాయి నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి ఆమె తాత ఎన్టీఆర్ స‌మాధి వ‌ద్ద నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌ర్ల‌తో బాలకృష్ణ మాట్లాడారు. తాను తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఈ నెల 26 నుంచి ప్ర‌చారం చేస్తాన‌ని.. ఎక్క‌డెక్క‌డ ప్ర‌చారం చేసే సంగ‌తిని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. కేవ‌లం టీడీపీ పోటీ చేస్తున్న‌ స్థానాల్లోనేగాక మ‌హా కూట‌మిలోని ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాలు పోటీ చేస్తున్న స్థానాల్లోనూ ప్ర‌చారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక్క‌డే విలేక‌ర్లు సంధించిన మ‌రో ప్ర‌శ్న‌కు బాల‌య్య చెప్పిన స‌మాధానం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. టీడీపీ త‌ర‌ఫున తెలంగాణ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు బాల‌య్య స్పందిస్తూ.. ఎవ‌రి ఇష్టం వాళ్ల‌ద‌ని బ‌దులిచ్చాడు. సినిమా షెడ్యూళ్లు - ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను బ‌ట్టి ప్ర‌చారానికి వ‌చ్చేది - లేనిది వాళ్లే చూసుకుంటార‌ని ముక్త‌స‌రిగా బ‌దులిచ్చాడు.

బాల‌య్య స‌మాధానం ఇచ్చిన తీరు చూస్తే.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ దూర‌మైన‌ట్లేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ప్ర‌చారానికి సంబంధించి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి హామీ రాక‌పోవ‌డం వ‌ల్లే బాబాయ్ అలా స‌మాధానం దాట‌వేశాడ‌ని చెప్తున్నారు. వారి వాద‌న‌లో నిజ‌ముంద‌ని భావిస్తున్నారు. సుహాసిని రాజ‌కీయ అరంగేట్రం ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌ల‌కు ఏమాత్రం ఇష్టం లేద‌ని అంటున్నారు. సొంత సోద‌రి తొలిసారిగా ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసేందుకు వెళ్తుంటే.. తోడు రాక‌పోవ‌డాన్ని బ‌ట్టే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌చారం నిర్వ‌హిస్తే.. గ‌తంలో తాను తీవ్రంగా విమ‌ర్శించిన కాంగ్రెస్‌కు వంత‌పాడాల్సి వ‌స్తుంద‌ని - త‌మ తండ్రి మ‌ర‌ణించిన‌ప్ప‌డు బాస‌ట‌గా నిలిచిన కేసీఆర్‌ - కేటీఆర్‌ ల‌కు ఎదురెళ్లాల్సి వ‌స్తుంద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - క‌ల్యాణ్‌రామ్‌లు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రెండూ ఇష్టం లేక‌నే వారు ప్ర‌చారానికి దూరంగా ఉండ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.