Begin typing your search above and press return to search.

సింగిల్ గా ఉంటేనే సీఎం పోస్టు?

By:  Tupaki Desk   |   20 March 2017 5:16 AM GMT
సింగిల్ గా ఉంటేనే సీఎం పోస్టు?
X
వివాహం విద్యానాశాయ.. శోభనం సర్వం నాశాయ అన్నారు. ఆ మాటలో నిజమెంతో కానీ ఇండియాలో మాత్రం ఇప్పుడు బ్యాచిలర్ సీఎంల ట్రెండు బాగా నడుస్తోంది. దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ బ్రహ్మచారి కాకపోయినా కుటుంబ జీవితానికి దూరంగా ఉంటున్న ఒంటరి పక్షే. సింగిల్ గా ఉండబట్టే ఆయన అంత సక్సెస్ సాధించారనేవారూ ఉన్నారు. మోడీకి కూడా అదే నమ్మకం ఉందో ఏమో కానీ.. ఆయన ప్రధాని అయింది మొదలు బీజేపీ అధికారం అందుకుంటున్న రాష్ర్టాల్లో వీలైనంత వరకు బ్రహ్మచారులనే సీఎంలుగా నియమిస్తున్నారు. దీంతో ఒక్క బీజేపీలోనే ఇప్పుడు నలుగురు బ్రహ్మచారులు సీఎంలుగా ఉన్నారు. మొత్తంగా దేశంలో ఆరుగురు ముఖ్యమంత్రులు బ్రహ్మచారులు. దీంతో ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా అత్యధికంగా ఆరుగురు బ్రహ్మచారులు సీఎం పదవిలో ఉన్నారు. మొన్న అయిదు రాష్ర్టాల ఎన్నికలు జరగక ముందు.. జయలలిత మరణానికి ముందు ఈ సంఖ్య అయిదుగా ఉండేది జయలలిత మృతితో ఈ సంఖ్య నాలుగుకి తగ్గగా తాజాగా ఉత్తరాఖండ్ లో త్రివేంద్ర సింగ్ రావత్ - యూపీలో యోగి ఆదిత్యనాథ్ లను ముఖ్యమంత్రులను చేయడంతో ఆ సంఖ్య ఆరుకి పెరిగింది. ఇక ఏకాకి సీఎంలు అన్న లెక్క తీసుకుంటే దేశంలో మొత్తం ఏడుగురున్నారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా ఒంటరే. ఆయన భార్య 2001లో క్యాన్సర్ తో మరణించారు.

కాగా మోడీ ప్రధాని అయిన తరువాత బ్రహ్మాచారి సీఎంల నియామకం హరియాణా నుంచి మొదలైంది. 2014 అక్టోబరులో అక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా నియమించారు. ఆయన అవివాహితుడు. అనంతరం 2016లో జరిగిన అయిదు రాష్ర్టాల ఎన్నికల్లో అసోంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో అక్కడ అవివాహితుడైన కేంద్రమంత్రి శర్వానంద్ సోనోవాల్ ను సీఎం చేశారు. తాజాగా జరిగిన అయిదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ యూపీ - ఉత్తరాఖండ్ లో పూర్తి మెజారిటీతో గెలిచింది. ఈ రెండు రాష్ర్టాల్లోనూ బ్రహ్మచారులైన యోగి ఆదిత్యనాథ్.. త్రివేంద్ర సింగ్ రావత్ లను సీఎం పీఠమెక్కించారు.

ఈ నలుగురు కాకుండా ను మన పొరుగు రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ కూడా బ్రహ్మచారి. బ్రహ్మచారి సీఎంలలో ఆయనే సీనియర్ అని చెప్పుకోవాలి. గత పదిహేడేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒడిశా పొరుగునే ఉన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అవివాహితురాలే.

* దీంతో ఒడిశా మొదలుకుని బెంగాల్ మీదుగా అసోం వరకు వరుసగా మూడు రాష్ర్టాల్లో బ్రహ్మచారులే సీఎంలుగా ఉన్నారు.

* అలాగే ఉత్తర ప్రదేశ్ - ఉత్తరాఖండ్ - హరియాణాలు కూడా పక్కపక్క రాష్ర్టాలే. ఈ మూడిటికీ బ్రహ్మచారులే ముఖ్యమంత్రులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/