Begin typing your search above and press return to search.

బాబు ఎన్నిక‌ల ప్లాన్ అదిరిందిగా

By:  Tupaki Desk   |   15 Nov 2017 4:19 AM GMT
బాబు ఎన్నిక‌ల ప్లాన్ అదిరిందిగా
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు నోరు తెరిచినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాదే! అని అంటుంటారు. అంతేకాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. త‌మ ప్ర‌భుత్వమే ఎప్ప‌టికీ అధికారంలో ఉండాల‌ని కూడా అనేస్తుంటారు. కొన్నాళ్ల కింద‌ట ఇదే విష‌యం మాట్లాడుతూ.. రాబోయే 30 ఏళ్లు త‌మ‌నే ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు. మ‌రి ఆ ప్ర‌జ‌లు ఎందుకు కోరుకుంటున్నారో? బాబుకు ఎప్పుడు చెప్పారో? మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు! మొత్తానికి ఆయ‌న విష‌యాల‌ను వెల్ల‌డించ‌డం ద్వారా చంద్ర‌బాబులో అధికార దాహం తీర‌లేద‌నే విష‌యం మాత్రం వెల్ల‌డైంది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్య‌లోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే పాద‌యాత్ర ప్రారంభించారు. గ‌త ఎన్నిక‌ల్లో కొద్దిపాటి తేడాతో సీఎం పీఠం ద‌క్క‌కుండా పోవ‌డంతో తీవ్రంగా క‌ల‌త చెందిన జ‌గ‌న్‌.. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నారు. దీనికి ఆయ‌న అన్ని ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ఒక ప‌క్క న‌డుము స‌హ‌క‌రించ‌క‌పోయినా.. కూడా.. ప్ర‌జ‌ల్లో పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విప‌రీతంగా జ‌నాలు క్యూ క‌డుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్ స్వాగ‌తాలు ప‌లుకుతూ.. మా ఓటు మీకే అని చెబుతున్నారు. ఈ ప‌రిణామంతో టీడీపీ అధినేత బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

దీంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ ప్ర‌ణాళిక వేశారు. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎంఏవై ప‌థ‌కాన్ని రాష్ట్రంలో విస్తారంగా అమ‌లు చేసి.. ఆ ఇళ్ల‌ను చూపించి ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని చంద్ర‌బాబు ప్లాన్ రెడీ చేసుకున్నారు. తాజాగా ఈ విష‌యాన్ని ఆయ‌న న‌ర్మ గ‌ర్భంగా అసెంబ్లీలో వెల్ల‌డించారు. అసెంబ్లీలో ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని(పీఎంఏవై ప‌థ‌కం కింద వీటిని నిర్మిస్తున్నారు. అయితే, బాబు ఎక్క‌డా ఈ పేరు వాడుకోవ‌డం లేదు), గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉందని, 19 లక్షల ఇళ్లు నిర్మించి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు(అంటే కేంద్రం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాన్ని అడ్డు పెట్టుకుని బాబు ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ప్లాన్‌). రూ.56వేల కోట్లు ఖర్చుపెట్టి పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, హుద్‌హుద్‌ బాధితుల కోసం 9,170 ఇళ్లు పూర్తిచేస్తున్నామని వివరించారు. హుద్‌హుద్‌ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10వేలు చొప్పున విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తానికి బాబు ప్లాన్‌.. ఇంత ఘోరం గా ఉంటుంద‌ని అనుకోలేద‌ని అంటున్నారు ఆఫ్ ది రికార్డుగా బీజేపీ నేత‌లు. మ‌రి బాబు ప్లాన్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.