Begin typing your search above and press return to search.

ఆది పార్టీ మార‌డానికి కార‌ణం ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   17 July 2017 12:10 PM GMT
ఆది పార్టీ మార‌డానికి కార‌ణం ఇదేన‌ట‌!
X

కేశ‌వ‌రెడ్డి విద్యా సంస్థ‌ల పేరిట తెలుగు నేల వ్యాప్తంగా పాఠ‌శాల‌లు ఏర్పాటు చేసిన కేశ‌వ‌రెడ్డి గుర్తున్నారా? *మీ పిల్ల‌ల‌కు ప‌దో త‌ర‌గ‌తి దాకా విద్యాబుద్ధులు ఉచితంగానే చెబుతాం... అందుకు మీరు మా వ‌ద్ద కొంత సొమ్ము డిపాజిట్ చేయండి... కాల ప‌రిమితి ముగిసిన త‌ర్వాత మీ పిల్ల‌లతో పాటు మీ డిపాజిట్ల‌ను కూడా తీసుకెళ్లండి* అంటూ మాయ మాట‌లు చెప్పి కోట్లాది రూపాయలు జేబులో వేసుకుని వేల మంది పిల్ల‌ల భ‌విష్య‌త్తును అయోమ‌యంలో ప‌డేసిన కేశ‌వ‌రెడ్డి ఎందుకు గుర్తుండరు. నిజ‌మే.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన ఈ కేశ‌వ‌రెడ్డి... తొలుత త‌న సొంతూరు నంద్యాల‌లో ఓ చిన్న పాఠ‌శాల‌ను ఏర్పాటు చేసి ఆ త‌ర్వాత ఆ పాఠ‌శాల శాఖ‌ల‌ను తెలుగు నేల వ్యాప్తంగా లెక్క‌లేనంత‌గా తెరిచేశారు. అదే జోరుతో డిపాజిట్ల పేరిట పిల్ల‌ల త‌ల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను కూడా ఆయ‌న వ‌సూలు చేశారు. డిపాజిట్లతో పాటు భారీ ఎత్తున అప్పులు చేసిన కేశ‌వ‌రెడ్డి ఇటీవ‌ల డిఫాల్ట్ అయ్యారు.

ఈ వ్య‌వ‌హారం తెలుగు నేల వ్యాప్తంగా పెను క‌ల‌క‌ల‌మే రేపింది. కేశ‌వ‌రెడ్డి అరెస్ట్ కాగా... ఆయ‌న నేతృత్వంలో న‌డిచిన పాఠ‌శాల‌ల‌ను ఎలాగోలా న‌డిపేలా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. అంతేకాకుండా కేశ‌వ‌రెడ్డి వ‌ద్ద త‌మ పిల్ల‌ల చ‌దువుల కోసం డిపాజిట్లు చేసిన వారికి అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌బోమ‌ని పేర్కొన్న చంద్ర‌బాబు స‌ర్కారు... డిపాజిట్ల‌ను తిరిగి ఇప్పించే పూచీ త‌న‌దేన‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చి కూడా కూడా ఏళ్లే గ‌డుస్తోంది. అయితే డిపాజిట్లు తిరిగి వచ్చిన దాఖలా లేక‌పోగా... కేశ‌వ‌రెడ్డిని చంద్ర‌బాబు స‌ర్కారు కాపాడుతోంద‌న్న వాద‌న ఇప్పుడు గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఇదేదో గిట్ట‌ని వారు చేస్తున్న వాద‌న కాదు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం కేశ‌వ‌రెడ్డి వ‌ద్ద ల‌క్ష‌ల కొద్దీ డిపాజిట్లు చేసిన త‌ల్లిదండ్రులు చేస్తున్న వాదన ఇది. కేశ‌వ‌రెడ్డి నుంచి డిపాజిట్లు తిరిగి ఇప్పిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం మూడేళ్లు గడుస్తున్నా స్పందించ‌కుండా ఉండిపోవ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు రోడ్డెక్కారు. వారికి వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీవై రామయ్య కూడా ఆందోళ‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలు జిల్లాకే చెందిన బీవై రామ‌య్య ఓ ఆస‌క్తిక‌ర వాద‌న వినిపించారు.

క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి వైసీపీ టికెట్‌ పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి కొంత‌కాలం క్రితం టీడీపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న చంద్ర‌బాబు కేబినెట్ లో మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో చేర‌క‌ముందు కేశ‌వ‌రెడ్డి సంస్థ‌ల అన్యాయంపై కాస్తంత వేగంగానే స్పందించిన చంద్రబాబు స‌ర్కారు... ఆయ‌న పార్టీ మార‌గానే కేశ‌వ‌రెడ్డి ఉదంతంపై ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. త‌న‌కు బంధువైన కేశ‌వ‌రెడ్డిని కాపాడేందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో చేరిపోయార‌ని రామ‌య్య ఆరోపించారు. కేశవ‌రెడ్డి విద్యా సంస్థ‌ల మోసంపై ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఏమాత్రం స్పందించ‌కుండా ఉన్న వైనాన్ని ప‌రిశీలిస్తే... బీవై రామ‌య్య వాద‌న నిజ‌మేన‌ని భావించక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.