Begin typing your search above and press return to search.

కేసీఆర్ తిరుప‌తి టూర్‌ ను స్వాగ‌తించిన ఎర్ర‌న్న‌

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:00 AM GMT
కేసీఆర్ తిరుప‌తి టూర్‌ ను స్వాగ‌తించిన ఎర్ర‌న్న‌
X
బాహుబ‌లి వంటి సినిమాల్లో గ్రాఫిక్స్ చూపిస్తే ఆద‌రించార‌ని అంత‌కుమించిన గ్రాఫిక్స్ లెక్క‌ల‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ చూపిస్తున్నార‌ని సీపీఎం నేత బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. సినిమాల్లో అయితే గ్రాఫిక్స్ నూ అంతా ఆదరిస్తారని, అలాగని నిజజీవితంలోకూడా రాష్ట్ర అభివృద్ధిపై లెక్కల గారడీ చేసి ప్రజలను మోసగించడం తగదని అన్నారు. ప్రజా చైతన్యబస్సు యాత్రలో పాల్గొనడానికి తిరుపతి వెళ్లిన సంద‌ర్భంగా పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణంపై గాల్లో మేడలు కట్టడం చూస్తే ఏపీ సీఎం చంద్ర‌బాబు గ్రాఫిక్స్ స‌త్తా అర్థ‌మ‌వుతోంద‌ని ఎద్దేవా చేశారు. కిందిస్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలపై ఆయన దృష్టిసారించాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. దేవుడికి భక్తులు హుండీలో సమర్పించే కానుకలను ప్రభుత్వం దోచుకుంటోందని రాఘ‌వులు మండిపడ్డారు. బాబుది చేతల ప్రభుత్వం కాదని, కోత‌ల ప్ర‌భుత్వ‌మ‌ని ఆయన విమర్శించారు. ముంబయి పారిశ్రామిక వేత్తల సదస్సులో రాష్ట్ర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన సీఎం స్థాయి దిగజార్చారని మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వచ్చారని - చాలా సంతోషంగా ఉందని రాఘవులు అన్నారు. వేంకటేశ్వర స్వామిని ఆంధ్రా దేవుడిగా ఆయన చూడలేదన్నారు. ఆంధ్రా దేవుడు కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటాడని కేసీఆర్‌కు నమ్మకం కలిగిందని...అందుచేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ దేవుడు దగ్గరకు వెళ్లి రావడం మంచిదని ఆయన సూచించారు. ఈ రకంగా ఐక్యతను చాటుతుందని, యాదగిరి గుట్టకో, భద్రాచలమో వెళ్లి ఆయన కూడా కోరుకోవడం మందచిదని, తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని రాఘవులు అభిప్రాయపడ్డారు.సామాజిక న్యాయం కోసం రాజకీయ సమరానికి ప్రజా చైతన్య యాత్రతో శంఖారావాన్ని పూరించడంతో భవిష్యత్ ఉద్యమానికి పునాది పండిందని చెప్పారు. ఎస్సీ - ఎస్టీ - బిసి ముస్లిం - మైనార్టీ - క్రైస్తవుల హక్కుల సాధనకై జనవరి 26న ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన ప్రజా చైతన్య బస్సుయాత్ర తిరుపతికి చేరుకుంది. ఈసందర్భంగా తిరుపతిలో అంబేద్కర్ భవన్‌ లో ఏర్పాటు చేసిన సభలో రాఘవులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సామాజిక సమస్యలపై ఎవరికి వారు పోరాటాలు చేసే పరిస్థితి కొనసాగుతూ వచ్చిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపుమేరకు జనచైతన్య బస్సు యాత్ర ప్రారంభమైందన్నారు. ఈ యాత్ర ఇప్పటివరకు 10 జిల్లాల్లో 126 నియోజక వర్గాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామన్నారు. పేదల భూములు లాక్కోవాలని చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/