Begin typing your search above and press return to search.

రాహుల్ ఆశలపై నీళ్లు చల్లిన బీఎస్పీ

By:  Tupaki Desk   |   17 July 2018 7:00 AM GMT
రాహుల్ ఆశలపై నీళ్లు చల్లిన బీఎస్పీ
X

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో కైరానా లోక్ సభ స్థానం ఉప ఎన్నిక గుర్తుందా... బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ - సమాజ్ వాది - బీఎస్పీ అన్నీ కలిసి రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించాయి. ఈ పరిణామంతో ఉత్తర ప్రదేశ్‌ లో విపక్షాలన్నీ కలిసిపోయాయంటూ బీజేపీ వ్యతిరేక మీడియా తెగ సంబరపడిపోయింది. అంతేకాదు... ఇది దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఇతర పార్టీలన్ని మద్దతిస్తాయనడానికి సంకేతమని.. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయంటూ విశ్లేషణలు మీద విశ్లేషణలు చేశాయి. గట్టిగా రెండు నెలలు కూడా కాకముందే అప్పుడు మద్దతిచ్చిన బీఎస్పీ పార్టీ స్వరం మార్చేసింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రాయి పడేలాంటి కామెంట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి తమ పార్టీ అధినేత మాయావతి అని ప్రకటించడంతో పాటు రాహుల్ గాంధీ విదేశీ వనితకు జన్మించిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రధాని కాగల అర్హత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఎస్పీ నేతలు.

నిజానికి కాంగ్రెస్ - బీఎస్పీలు కొన్నాళ్లుగా సఖ్యతగా ఉన్నట్లు కనిపించాయి. కానీ... తాజాగా ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కు షాకిచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మాయావతి పేరును తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీ విదేశీయురాలైనందున రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. రానున్న లోక్‌ సభ ఎన్నికలపై చర్చించేందుకు బీఎస్పీ అధినాయకత్వం భేటీ కాగా ఆ సమావేశంలో ఆ పార్టీ జాతీయ సమన్వయకర్తలు వీర్ సింగ్ - జై ప్రకాష్ సింగ్‌ లు దేశప్రధానిగా మాయావతి ఉండాలని ఇప్పటికే సమయం మించిపోయిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు నరేంద్ర మోడీని ఢీకొట్టగల సత్తా ఒక్క మాయావతికే ఉందని వారన్నారు.

అంతేకాదు.. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీయూ పొత్తు క్రెడిట్ కూడా మాయావతికే ఇచ్చారు. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి పగ్గాలు చేపట్టడంలో మాయావతి కీలకంగా వ్యవహరించి తన సత్తాను చాటారని చెప్పిన జై ప్రకాష్ సింగ్... నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయాలను ధీటుగా ఎదొర్కొనగల దమ్మున్న నాయకురాలు ఒక్క మాయావతే అని అన్నారు. మాయావతి ఒక దళిత నేతనే కాదు ఆమెకు వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా పుష్కలంగా ఉందన్నారు.

అదేసమయంలో రాహుల్ ను విమర్శిస్తూ రాహుల్ ముఖ పోలికలు సోనియా ముఖపోలికలతో ఉంటాయని రాజీవ్ గాంధీ పోలికలు లేవని బీఎస్పీ వ్యాఖ్యలు చేసింది. సోనియా విదేశీయురాలు కనుక రాహుల్ దేశప్రధానిగా ఎప్పటికి కాలేరని అది ఆమోదయోగ్యం కాదని బీఎస్పీ కామెంట్ చేసింది. బీఎస్పీ నేతలు చేసిన తాజా వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ షాక్ తిన్నారట.