Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్: చిత్తు అయిన ఎస్పీ-బీఎస్పీ పొత్తు!

By:  Tupaki Desk   |   19 May 2019 5:11 PM GMT
ఎగ్జిట్ పోల్స్: చిత్తు అయిన ఎస్పీ-బీఎస్పీ పొత్తు!
X
రాజకీయంలో వన్ ప్లస్ వన్ ఎన్నటికీ టు కాదు అనేది ఒక సామెత. యూపీలో కూడా అదే జరిగింది అంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం - అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం అయిన ఉత్తర్ ప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ప్రత్యేకించి అక్కడ ఈ సారి పోల్ పొత్తులు రాజకీయ సమీకరణాలను ఆసక్తిదాయకంగా మార్చాయి.

ఎస్పీ-బీఎస్పీలు పొత్తు పెట్టుకుని మహాఘట్ బంధన్ అంటూ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యూపీలో బలమైన ప్రాంతీయ పార్టీలు అయిన ఈ రెండూ దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఈ సారి కలిసి పోటీ చేశాయి. బీజేపీ ఓడించడమే లక్ష్యమని ప్రకటించాయి. సీట్ల పంపకం విషయంలో కూడా ఎలాంటి పేచీలు లేకుండా పోటీ కి దిగాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ..వీటి కలయిక బీజేపీని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి.

ఎస్పీ-బీఎస్పీలు రెండూ కలిసినా యూపీలో సాధించేది 18 ఎంపీ సీట్లే అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉండటం విశేషం. ఆ రెండు పార్టీల గత ఓట్ల శాతాన్ని కలుపుకుంటే.. ఆ పార్టీల కలిసి 50కి పైగా ఎంపీ సీట్లు రావాలి. అయితే దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఆ పార్టీల కార్యకర్తలు చేతులు కలపడం కష్టమే అనేది ప్రాథమికమైన అంశం. అదే ఆ కూటమిని దెబ్బ కొట్టిందని.. ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపినా.. కమలానికి ఏ ఇబ్బంది లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

యూపీలో బీజేపీ సాధించబోయే ఎంపీ సీట్ల సంఖ్య 60 కి పైగా ఉంటుందని కూడా పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేస్తూ ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ సోలోగా పోటీ చేసి ఎనిమిది శాతం వరకూ ఓట్లను పొంది ఉంటుందని.. ఒకటీ లేదా రెండు ఎంపీ సీట్లలో అది నెగ్గవచ్చని పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి!