ఆ సైనికుడు ప్రశ్నలకు సమాధానం ఇదా..?

Wed Jan 11 2017 22:13:37 GMT+0530 (IST)

తేజ్ బహదూర్ యాదవ్.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు ఇది. సరిహద్దులో పహారా కాస్తున్న ఈ సైనికుడు పెట్టిన ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సైన్యంలో తమకు నాసిరకమైన భోజనం పెడుతున్నారనీ కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తూ ఆహార పదార్థాలను అమ్ముకుంటున్నారని చెబుతూ.. తాను తింటున్న భోజన పదార్థాలను కూడా చూపించాడు. మన సైనికులకు ఇలాంటి భోజనం పెడుతున్నారా అని చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇలాంటి విషయం వెలుగులోకి రాగానే జరగాల్సింది ఏంటీ..?  సైనికుల ఆహారం విషయంలో పునః సమీక్ష జరగాలి. అలాంటి భోజనం అందిస్తున్నవారిపై చర్యలేవైనా ఉండాలి. లేదా యాదవ్ ఆరోపణల్లో నిజానిజాలు నిష్పాక్షికంగా తేల్చే దిశగా చర్యలు ఉండాలి. కానీ.. వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా ఉన్నాయి! చుట్టూ తిరిగి యాదవ్ ని దోషిగా చిత్రించే ఆరోపణలు వినిపించడం విచిత్రం!

యాదవ్ పక్కా తాగుబోతు అనీ - విధులను సరిగా నిర్వర్తించడనీ - నచ్చిన టైమ్ కి వచ్చిన ఇష్టం వచ్చినంత సేపు డ్యూటీ చేసి వెళ్లిపోతుంటాడని బి.ఎస్.ఎఫ్. అధినేత చెబుతున్నారు. తేజ్ బహదూర్ ట్రాక్ రికార్డు సరిగా లేకపోవడం వల్లనే అతడికి గడచిన 20 సంవత్సరాలుగా ప్రమోషన్ రాలేదనీ ఆ అసంతృప్తితోనే ఇలాంటి వీడియో తీసి పోస్ట్ చేశాడని అంటున్నారు. 2010లో అతడిని కోర్టు మార్షన్ కూడా చేశామనీ.. కేవలం అతడిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని విధుల్లో కొనసాగిస్తున్నామని ఐజీ చెప్పడం విశేషం. సైనికులకు అందిస్తున్న ఆహారం ఎంతో నాణ్యమైనదనీ... ప్రస్తుతం చలి ఎక్కువగా ఉండటం వల్ల కాస్త రుచి మారే అవకాశం ఉంటుందని కవర్ చేసుకున్నారు. అధికారుల్లో అవినీతి అనే ప్రశ్నకు తావు ఉండదనీ అందరూ దేశభక్తితో పనిచేస్తారని అన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే... తేజ్ బహుదూర్ చేసిన ఆరోపణల గురించి మాట్లాడకుండా... అతడి కార్యెక్టర్ పై విమర్శలు చేయడం విశేషం! ఒకవేళ అతడు క్రమశిక్షణ లేకుండానే సైన్యంలో ఉంటే... అలాంటి సైనికుడి చేతికి తుపాకీ ఇచ్చి సరిహద్దులో ఎలా నిలబెట్టారన్నది ప్రశ్న. ఇరవయ్యేళ్లుగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నవారిని సైన్యం ఎందుకు భరిస్తుంది అనేది మరో ప్రశ్న. సరే వీడియో ద్వారా యాదవ్ చెప్పినవన్నీ అబద్ధాలే అనుకుందాం... అతడు చూపించిన ఆహార పదార్థాల పరిస్థితేంటీ..? యాదవ్ మీద ఐజీ చేసిన ఆరోపణల్లో నిజాలు ఉన్నా లేకపోయినా సంస్థకు ఆయన జవాబుదారుగా ఉండక తప్పదు కదా!

ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. పైగా దేశాన్ని పాలిస్తున్న పార్టీకి విపరీతమైన దేశభక్తి ఉందని దాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకునే ప్రయత్నం సదరు పార్టీ నాయకులు చేస్తూనే ఉంటారు. ఇలాంటి తరుణంలో ఒక సైనికుడి నుంచి వ్యక్తమైన అభిప్రాయంపై ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటే... వేరే కోణం నుంచి ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా డ్యూటీలో ఉండగా సెల్ ఫోన్ వాడకూడదన్న ఆరోపణపై యాదవ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. తప్పులేదు! కానీ ఆయన చేసిన ఆరోపణలపై మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా.  సైన్యంలో పరిస్థితి ఇలా ఉందా అనే అనుమానాలకు ప్రజల్లో మిగిలిపోకూడదు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/