Begin typing your search above and press return to search.

య‌డ్యూర‌ప్ప అనే నేను.. ప్ర‌మాణం పూర్తైంది!

By:  Tupaki Desk   |   17 May 2018 5:25 AM GMT
య‌డ్యూర‌ప్ప అనే నేను.. ప్ర‌మాణం పూర్తైంది!
X
అవును.. క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప అయ్యారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన ఎమ్మెల్యేల సంఖ్య లేన‌ప్ప‌టికీ.. సీఎం ప‌గ్గాల్ని చేప‌ట్టారు. ప్ర‌భుత్వం కొలువు తీరితే.. జ‌ర‌గాల్సిన‌వి జ‌రిగిపోతాయ‌ని న‌మ్మ‌కంగా ఉన్న బీజేపీ అధినాయ‌క‌త్వం పుణ్య‌మా అని య‌డ్యూర‌ప్ప మ‌రోసారి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏర్ప‌డి త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిస్థితులు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లైంది.

బుధ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి రావాల్సిందిగా య‌డ్యూర‌ప్ప‌కు క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా ఆహ్వానం పంప‌టం.. ఆ వెంట‌నే స్పందించిన య‌డ్డీ.. గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని ముహుర్తం ఫిక్స్ చేసుకోవటం తెలిసిందే.

ముందే అనుకున్న‌ట్లుగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు రాధాకృష్ణ ఆల‌యంలో య‌డ్యూర‌ప్ప పూజ‌లు చేశారు. అనంత‌రం రాజ్ భ‌వ‌న్ కువ‌చ్చిన ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్ వ‌జుభాయ్ వాలా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. దీంతో య‌డ్డీ మూడోసారి సీఎంగా ప్ర‌మాణం చేసిన‌ట్లైంది. గ‌తంలో రెండు ద‌ఫాలు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్డీ ప్ర‌మాణ‌స్వీకారంతో 23వ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ట్లైంది.

ఇదిలా ఉంటే.. మ‌రో 15 రోజుల్లో అసెంబ్లీలో య‌డ్యూర‌ప్ప త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 8 మంది ఎమ్మెల్యేల అవ‌స‌రం య‌డ్యూర‌ప్ప స‌ర్కారుకు ఉంది. య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి బీజేపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆస‌క్తిక‌రంగా బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఎవ‌రూ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి హాజ‌రు కాలేదు.

సంపూర్ణ మెజార్టీ లేక‌పోవ‌టం.. బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కోవాల్సి ఉన్న నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు హాజ‌రైతే విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశంతో పాటు.. రాంగ్ సిగ్న‌ల్స్ ఇచ్చిన‌ట్లుగా ఉంటుంద‌న్న ఉద్దేశంతో వారెవ‌రూ రాలేద‌ని చెబుతున్నారు. ప్ర‌మాణస్వీకార మ‌హోత్స‌వం పూర్తి అయిన త‌ర్వాత సీఎం హోదాలో య‌డ్యూర‌ప్ప‌.. బీజేపీ జాతీయ నేత‌లు ముర‌ళీధ‌ర్ రావు.. అనంత‌కుమార్ త‌దిత‌ర నేత‌ల‌తో అల్పాహారాన్ని చేశారు. ఈ సమ‌యంలో య‌డ్యూర‌ప్ప రిలాక్స్ గా ఉన్న‌ట్లు క‌నిపించింది. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం ఇచ్చిన వెంట‌నే య‌డ్యూర‌ప్ప ముఖంలో న‌వ్వులు పూశాయి. ఆయ‌న‌కు కంగ్రాట్స్ చెబుతూ గ‌వ‌ర్న‌ర్ పుష్ప‌గుచ్చాన్ని ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. యడ్యూర‌ప్ప ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంపై కాంగ్రెస్‌.. జేడీఎస్ నేత‌లు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన‌ట్లుగా వారు వ్యాఖ్యానించారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్డీ ప్ర‌మాణ‌స్వీకారాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త‌ప్పు ప‌ట్టారు. కాంగ్రెస్ నేత‌లు అజాద్‌.. అశోక్ గెహ్లాట్‌.. సిద్ద‌రామ‌య్య‌.. మల్లికార్జున ఖ‌ర్గే.. విధాన‌సౌధ‌లోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపారు. మ‌రోవైపు.. కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేలు బ‌స్సుల్లో విధాన‌సౌధ వ‌ద్ద‌కు చేరుకొని నిర‌స‌న‌లు చేప‌ట్టారు.

ఇదిలా ఉంటే.. బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంతోషంతో చిందులు వేశారు. ప‌ట్గ‌లేని ఆనందంతో వీధుల్లోకి వ‌చ్చి డ్యాన్సులు చేశారు.