Begin typing your search above and press return to search.

కత్తి పట్టిన కేసీఆర్ ఏం చెప్పారంటే..

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:41 AM GMT
కత్తి పట్టిన కేసీఆర్ ఏం చెప్పారంటే..
X
కొత్త కొత్త హామీలు ఇవ్వటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయననోటి నుంచి వచ్చే కొన్ని మాటలు వింటే ఆయన ధీమాకు ముచ్చట పడాల్సింది. తాజాగా అలాంటి ధీమా మాటలు కొన్నింటిని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల బీసీ కమిషన్ ఛైర్మన్ గా రాములు.. పలువురు సభ్యులు తమ పదవులకు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒకరు కత్తిని బహుకరించారు. ఇదిలా ఉంటే.. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఉదహరిస్తూ.. ఆ రాష్ట్రంలో అమల్లో ఉన్న తీరులోనే తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసి.. పార్లమెంటుకు పంపుతామని చెప్పుకొచ్చారు.

ముస్లిం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన కేసీఆర్.. బీపీఎల్ కుటుంబాలను దారిద్ర్యరేఖ ఎగువకు తీసుకురావటమే తమ లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై వివిధ కులాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు.. సలహాలు ఇవ్వాలని బీసీ కమిషన్ ను కేసీఆర్ కోరారు.

తెలంగాణలో 80 శాతానికి పైగా బలహీన వర్గాలు ఉన్నాయని.. వారిజీవన ప్రమాణాలు మెరుగు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన.. వారికి మేలు కలిగేలా రిజర్వేషన్లు పెరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో మాదిరి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుకోవాలని చెప్పిన కేసీఆర్.. అసెంబ్లీలో తీర్మానం చేయటమే కాదు.. కేంద్రాన్ని ఒప్పిస్తామన్న వ్యాఖ్యను చేశారు.

సామాజికంగా.. విద్యా పరంగా.. వెనుకబడిన కులాలకు ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో బీసీ కమిషన్ సిఫార్సులు చేయాలని.. ప్రస్తుం బీసీల్లో ఉన్న కులాల వారి ప్రయోజనాలు దెబ్బ తినకుండా.. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచేలా బీసీ కమిషన్ సూచనలు చేయాలన్నారు. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన విధానం పూర్తిగా మారిపోయిందని.. కొన్ని కుల వృత్తులు అంతరించిపోతున్నాయని.. వాటిపై ఆధారపడిన కులాలు.. కుటుంబాలు ఉపాధి కోల్పోతున్న విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. వాటిపై అధ్యయనం చేయాలని.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏమైనా..ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సందేశాన్ని ఇచ్చేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/