Begin typing your search above and press return to search.

మోడీని పొగుడుతూ విపక్షాల్ని టార్గెట్ చేస్తారు

By:  Tupaki Desk   |   25 May 2016 5:04 AM GMT
మోడీని పొగుడుతూ విపక్షాల్ని టార్గెట్ చేస్తారు
X
పని చేయటం ఒక ఎత్తు. ఆ చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవటం మరో ఎత్తు. చేసింది ఎంతైనా.. చేసింది చెప్పుకునే విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా.. గొప్పలు చెప్పుకోవటంలో మొనగాళ్లుగా మోడీ అండ్ కోను చెప్పుకోవాలి. తాజాగా ప్రచారమే లక్ష్యంగా మోడీ సర్కారు గొప్పల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవటంపై బీజేపీ తాజాగా ఫోకస్ పెట్టనుంది. మోడీ సర్కారు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్నిపురస్కరించుకొని మోడీ గొప్పతనం మీద దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని డిసైడ్ చేశారు.

మామూలుగానే ప్రచారం ఎక్కువగా చేసుకునే బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో ప్రచారమే లక్ష్యంగా పని చేయనున్నారు. మోడీ ప్రభుత్వం సాధించిన ఘనతల్ని ప్రచారం చేసుకోవటం మీద దృష్టి పెట్టనున్నారు.ఇందుకోసం భారీగానే ప్లాన్ ఒకటి సిద్ధం చేశారు. మోడీ సర్కారు సాధించిన విజయాల్ని 21 రోజుల పాటు ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ పేరిట ప్రచారం చేయనున్నారు.

ఈ కార్యక్రమం కోసం 33 బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో ఒక్కో కేంద్రమంత్రి ఉండనున్నారు. వారితో పాటు.. ఒక కేంద్ర సహాయమంత్రి.. జాతీయ స్థాయి లేదంటే రాష్ట్ర స్థాయి నేత ఒకరు ఉండనున్నారు. ఈ ప్రచారంలో మోడీ సర్కారు సాధించిన ఘనతలతోపాటు.. తాము మరింత చేయాలని అనుకున్నా.. విపక్షాలు తమను ఎలా అడ్డుకున్నాయన్న విషయం మీదా ప్రచారం చేయనున్నారు.

ముఖ్యమైన బిల్లుల్ని పార్లమెంటులో ఆమోదం పొందకుండా విపక్షాలు ఏ రీతిలో అడ్డుకున్నాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు. దీంతో.. వారిపై ఒత్తిడిని పెంచి.. రానున్న రోజుల్లో మరిన్ని బిల్లులకు ఆమోదం పలికేలా చేయాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు.. రాజకీయాలతో ప్రమేయం లేని విభాగాల మీద కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక సంఘాలు.. రైతులు.. మహిళలు.. లాయర్లు.. డాక్టర్లు లాంటి వృత్తి నిపుణులతో సమావేశాల్ని నిర్వహించనున్నారు.

దీంతో పాటు.. ఎన్డీయేకి చెందిన ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కనీసం రెండు రోజులు బస చేయటం.. ప్రజా సమస్యల మీద దృష్టి సారించటం.. అభిప్రాయాలు సేకరించటంతో పాటు.. ప్రధాని సందేశాన్ని వినిపించనున్నారు. మోడీ సర్కారు విజయాల్ని మండలస్థాయి వరకూ ప్రచారం చేయటమే లక్ష్యంగా కమలనాథులు ప్లాన్ చేయటం కనిపిస్తోంది. ఇక.. కీలకమైన సోషల్ మీడియా.. కేబుల్ టీవీల ద్వారా మోడీ సర్కారు గొప్పతనాన్ని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే.. రానున్న రోజుల్లో మోడీ మొనగాడితనం కథలు.. కథలుగా టీవీ సీరియల్ మాదిరి మూడు వారాలు సాగనుందన్న మాట.