Begin typing your search above and press return to search.

బీజేపీ vs టీఆర్ ఎస్.. ఎవరి బలం ఎంత?

By:  Tupaki Desk   |   20 Aug 2019 1:00 PM GMT
బీజేపీ vs టీఆర్ ఎస్.. ఎవరి బలం ఎంత?
X
దేశం మొత్తాన్ని జాతీయవాదం, హిందుత్వతో ఒక్కటి చేసి గెలిచేసిన బీజేపీకి ఇప్పుడు తెలంగాణ ఆశలు కల్పిస్తోంది. ఇక్కడ నలుగురు ఎంపీ సీట్లను గెలవగానే టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి రెడీ అయ్యింది. మరి నిజంగా బీజేపీకి తెలంగాణలో అంత బలం ఉందా.? కేటీఆర్ అన్నట్టు కర్ణాటకలో పన్నిన పన్నాగం తెలంగాణలో పారదా.? అసలు బీజేపీ బలం ఏంటి.? టీఆర్ ఎస్ బలం ఏంటీ.? ఏ పార్టీ ఇక్కడ మనుగడ సాధించగలదు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయా తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసింది. అప్పటిదాకా స్నేహితుడిగా ఉన్న కేసీఆర్ తో దోస్తీనే మోడీషాల బ్యాచ్ కొనసాగింది.కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో అస్సలు ఊహించని స్థితిలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుందో అప్పుడు బీజేపీకి తెలంగాణపై ఆశపుట్టింది. ఇక్కడ బలపడడానికి సామధాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తోంది.

ముఖ్యంగా తెలంగాణలో ముస్లింలు 12శాతానికి పైగా ఉన్నారు. గంగాజమున తహజీబ్ లాగా కలిసిపోయి ఒక సంస్కృతిలో భాగమయ్యారు. మతకల్లోలాలు, గొడవలకు దూరంగా హైదరాబాద్ లో కలిసి ఉంటున్నారు. కేసీఆర్ ముస్లింలకు ప్రవేశపెట్టిన పథకాలు, ఎంఐఎంతో దోస్తీ- లౌకిక వాదం ఎఫెక్ట్ తో ఇప్పుడు మైనార్టీలు సంతృప్తిగా ఉన్నారు.వీరు హిందుత్వ బీజేపీకి ఓటేసే పరిస్థితి ఉందా లేదా అన్నది అసలు ప్రశ్న.

అయితే యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ, ముస్లింలను విడగొట్టి బీజేపీకి హిందువుల ఓట్లు పడేలా స్ట్రాటజీ అమలు చేసిన బీజేపీకి ఇప్పుడు తెలంగాణలోనూ అదే ప్లాన్ వర్కవుట్ చేస్తోంది. కానీ తెలంగాణలో ఈ తరహా రాజకీయం వర్కవుట్ అయ్యే సూచనలైతే కనిపించడం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో నోరుజారిని కేసీఆర్ ‘హిందువులు.. బొందువులు’ అనడంతో అదే అస్త్రంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండిసంజయ్ గెలిచారు. కానీ అక్కడ హిందుత్వ కంటే వ్యక్తిగత ఇమేజే పనిచేసింది. బండి సంజయ్ ను చూసే జనాలు ఓట్లేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లోనూ బీజేపీ ఎంపీలు గెలిచారు.

నిజానికి నిజామాబాద్ లో బీజేపీ గెలిచిందనడం కంటే టీఆర్ ఎస్ ఓడిందనే చెప్పాలి. నిజామాబాద్ లో కవితను ఓడించడానికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే పాటుపడ్డారన్న విమర్శలున్నాయి. ఇక రైతుల ముసుగులో కాంగ్రెస్-బీజేపీ కలిసిపోయి కవితను ఓడించారని చెబుతుంటారు. ఇక ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థే ఓటమికి కారణం.. అత్యధికంగా ఉన్న గిరిజన సామాజికవర్గానికి ఇవ్వకుండా అత్యల్పంగా ఉన్న వారికి టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వడమే గులాబీ పార్టీ కొంపముంచింది. బీజేపీపై పోటీచేసిన సోయం బాపురావును గెలిపించింది. ఇక కరీంనగర్ లో మూడు సార్లు ఓడిన సానుభూతి, యువ నాయకుడు, కార్యదీక్షపరుడు, ప్రజల్లో తిరిగే బండిపై ప్రజల ఓదార్పే గెలిపించింది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిపై వివాదాస్పద తలసాని కొడుకును నిలబెట్టి టీఆర్ ఎస్ పెద్ద తప్పు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే బీజేపీ గెలిచేది కాదంటారు..

ఇలా బీజేపీ బలం అనుకున్నది బలం కాదు.. టీఆర్ ఎస్ బలహీనత మీదే గెలిచింది. సమర్థులైన అభ్యర్థుల వల్లే బీజేపీ గెలిచింది. ఇక్కడ బీజేపీని చూసి జనాలు ఓటేయలేదు. టీఆర్ ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత బీజేపీ అభ్యర్థులకు వరమైంది. టీఆర్ ఎస్ కనుక బలమైన వారిని నిలబెడితే పరిస్థితి వేరుగా ఉండేది. టీఆర్ ఎస్ తప్పుడు నిర్ణయాలే బీజేపీ గెలుపునకు కారణమయ్యాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో గులాబీ బాస్ మంచి నిర్ణయాలు తీసుకుంటే అసెంబ్లీ ఫలితాలే పునరావృతమవుతాయన్న అంచనాలు ఆ పార్టీలో ఉన్నాయి. సో జేపీ నడ్డా సహా అమిత్ షా ఎందరు వచ్చినా తెలంగాణలో గులాబీ జెండానే అంటున్న కేటీఆర్ స్ట్రాటజీ మాటల వెనుక అంతర్మథనం ఇదేనేమో..