Begin typing your search above and press return to search.

బీజేపీ నేత‌లను మ‌సూద్ టార్గెట్ చేశాడా?

By:  Tupaki Desk   |   22 Nov 2017 7:23 AM GMT
బీజేపీ నేత‌లను మ‌సూద్ టార్గెట్ చేశాడా?
X
మ‌న దేశంలో అల్ల‌ర్లు, బాంబుదాడులు - స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను ప్రోత్స‌హిస్తున్న పాకిస్థాన్ గూఢ‌చార సంస్థ ఐఎస్ఐ మ‌రోసారి భారీ విధ్వంసానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. దేశంలోని ప్ర‌ముఖ నేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను హ‌త్య చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌యోత్పాతం స‌ృష్టించే అవ‌కాశ‌మున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌ లోకి ప్రవేశించినట్లు ఐబి హెచ్చరికలు జారీ చేసింది.

ఐఎస్ ఐ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసే జైషే ఈ మ‌హ్మ‌ద్ (జేఈఎమ్‌) మ‌న దేశంలో ఈ కుట్ర‌ల‌కు వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌ని ఇంటెలిజెన్స్ నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. 2001లో భార‌త్‌ పార్ల‌మెంటుపై దాడి, 2008లో ముంబై మార‌ణ‌హోమం - 2016లో ప‌ఠాన్‌ కోట్ వైమానిక స్థావ‌రంపై దాడుల సూత్ర‌ధారి.. జేఈఎమ్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు ప్రకటించాయి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ప్ర‌ముఖ‌ నేతలను హత్య చేయడం ద్వారా భయోత్పాతం సృష్టించాలని జైషే ఈ మహ్మద్‌ ప్లాన్ చేస్తోందని ఇంటలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

జేఈఎమ్‌ - లష్కర్‌ ఈ తోయిబా(ఎల్‌ ఈటీ) బంగ్లాదేశ్‌ నుంచే మ‌న దేశంలో ఈ కుట్రను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఐబీ స్ప‌ష్టంచేసింది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు తమ టాస్క్‌ను పూర్తి చేసేందుకు భారత్‌ లోకి ప్రవేశించార‌ని ఐబీ పేర్కొంది. తక్కువ భద్రతతో తిరుగుతున్న బీజేపీకి చెందిన ఓ ముఖ్యమంత్రిని త‌మ‌ తొలి లక్ష్యంగా ఉగ్ర సంస్థలు నిర్దేశించుకున్నట్లు తెలిసింది. దీంతో భారత ఇంటిలిజెన్స్‌ బృందం అప్ర‌మ‌త్త‌మైంది. బంగ్లాదేశ్ అధికారుల సాయంతో ఢాకాలోని అనుమానిత ప్రదేశంపై దాడులు జరిపించింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి సమాచారం దొరకలేదని సమాచారం. మసూద్‌ అజర్‌ మేనల్లుడు (తహ్లా రషీద్‌)ని కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ కుట్ర జరుగుతున్న‌ట్లు అనుమానిస్తున్నారు.