Begin typing your search above and press return to search.

బీజేపీ కొత్త వ్యూహం...టీడీపీకి దెబ్బ ప‌డిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   22 Sep 2017 1:41 PM GMT
బీజేపీ కొత్త వ్యూహం...టీడీపీకి దెబ్బ ప‌డిన‌ట్టేనా?
X
బీజేపీ, టీడీపీ... చూడ్డానికి మిత్ర‌ప‌క్షాలే. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మిలో టీడీపీ కీల‌క భాగ‌స్వామిగానే ఉంది. ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని ఎన్డీఏ స‌ర్కారులో టీడీపీకి మంత్రి ప‌ద‌వులు ద‌క్కితే... అందుకు ప్ర‌తిగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వంలో బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌త క‌ట్టే టీడీపీ బ‌రిలోకి దిగింది. అస‌లు ఏమాత్రం విజ‌యం ఆశ‌లు లేకుండానే బ‌రిలోకి దిగిన టీడీపీ... అమ‌లు సాధ్యం కాని హామీల‌ను గుప్పించేసి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో ప్ర‌చారం చేయించుకుని ఎలాగోలా అధికారం చేజిక్కించుకుంది. ఈ క్ర‌మంలో బీజేపీ - టీడీపీల మ‌ధ్య మైత్రి ఇక శాశ్వ‌త‌మ‌ని, ఎప్ప‌టికైనా త‌మ రెండు పార్టీలు క‌లిసే బరిలోకి దిగుతాయ‌ని తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా కాస్తంత గ‌ట్టిగానే ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఎన్నిక‌లు ముగిసి విజ‌యానందంలో ఉన్న సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌ల‌ను బీజేపీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి.

అయితే బీజేపీ అస‌లు ల‌క్ష్యం.. ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్టుకుని విజ‌యం సాధించ‌డం కాదు. సింగిల్‌ గానే విజయం సాధించాల‌న్న‌దే ఆ పార్టీ ముందుకు ఏకైక లక్ష్యంగా ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉత్త‌ర భార‌తంలో మెజారిటీ రాష్ట్రాల్లో స‌త్తా చాటిన బీజేపీ... ఎన్డీఏలోని ఏ ఒక్క భాగ‌స్వామ్య‌ప‌క్షంతో అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో సీట్లు సాధించిన విష‌యం తెలిసిందే. ఒక్క ఉత్త‌రాదిపై ఉన్న ప‌ట్టుతోనే ఈ మేర విజ‌యం సాధిస్తే... ఇక ద‌క్షిణాదిలోనూ ఈ త‌ర‌హా ప‌ట్టు సాధిస్తే... ఇక ఆ పార్టీకి ఎదుర‌న్న‌దే ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షాల భావ‌న కూడా ఇదే. ఈ దిశ‌గా ప‌క్కాగా స్కెచ్ ర‌చించిన బీజేపీ ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లు టీడీపీని నిజంగానే తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి.

ఎందుకంటే... ఏపీలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం స్థానంలో వైసీపీ ఉంది. జ‌నాద‌ర‌ణ‌లో త‌న‌కు సాటి రాగ‌ల వారెవ్వ‌రూ లేర‌న్న రీతిలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూసుకువెళుతున్నారు. జ‌గ‌న్ జ‌నాద‌ర‌ణ‌కు ఎదురొడ్డి నిలిచే నేత‌లు టీడీపీలో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేర‌నే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌నాక‌ర్ష‌ణ‌లో మంచి పేరున్న న‌రేంద్ర మోదీ అవ‌స‌రం టీడీపీకి ఎంతైనా ఉంద‌న్న‌ది ఏ ఒక్క‌రూ కాద‌న‌లేని స‌త్య‌మే. ఈ నేప‌థ్యంలో బీజేపీ కొత్త ప‌థ‌కం గురించి చూచాయ‌గా తెలిసిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌ట‌. ఆ క‌థాక‌మామీషు ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అటు లోక్‌ స‌భ‌తో పాటు ఇటు శాస‌న‌స‌భ సీట్ల‌కు సంబంధించి బీజేపీ - టీడీపీలు క‌లిసే పోటీ చేశాయి. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మైత్రిని కేవ‌లం అసెంబ్లీ సీట్ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయాల‌న్న‌ది బీజేపీ యోచ‌న‌గా తెలుస్తోంది. అంటే 2019 ఎన్నిక‌ల్లో లోక్ స‌భ సీట్ల‌కు సంబంధించి బీజేపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతుంద‌న్న మాట‌. ఏపీలోని మొత్తం 25 లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయాల‌ని కూడా ఆ పార్టీ దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అంటే లోక్ స‌భ సీట్ల విష‌యంలో బీజేపీ... టీడీపీతోనూ పోటీ చేయ‌నుంద‌న్న మాట‌. కేవ‌లం అసెంబ్లీ సీట్లకు సంబంధించిన ఎన్నిక‌ల్లోనే బీజేపీ - టీడీపీతో జ‌త క‌డుతుంద‌ట‌. ఈ మేర‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర రావు కాస్తంత విపులంగానే కుండ‌బ‌ద్దలు కొట్టేశారు. దేశంలో బీజేపీ బ‌ల‌హీనంగా ఉన్న లోక్ స‌భ స్థానాలు ఏవ‌న్న విష‌యాన్ని లెక్కేయ‌గా... మొత్తం 130 వ‌ర‌కు ఉన్న‌ట్లు తేలింద‌ట‌. వాటిలో ద‌క్షిణాది రాష్ట్రాల్లోని సీట్లే అధికంగా ఉన్నాయ‌ట‌. దీంతోనే ఈ సీట్ల‌లో బ‌లం పెంచుకునేందుకే బీజేపీ ఈ కొత్త త‌ర‌హా వ్యూహానికి ప‌దును పెడుతోంద‌ట‌. ఈ వ్యూహంతో ప‌క్కాగా మంచి రిజ‌ల్ట్స్ సాధించేందుకు కూడా బీజేపీ ప్లాన్ వేసింద‌ట‌. ఈ ప్లాన్ ప్ర‌కారం ఐదేసీ లోక్‌స‌భ స్థానాల‌ను ఓ క్ల‌స్ట‌ర్‌ గా ఏర్పాటు చేసి, దాని ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ను పార్టీ జాతీయ స్థాయి నేత‌కు అప్ప‌గిస్తార‌ట‌. ఇలా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఓ క్ల‌స్ట‌ర్‌కు ముర‌ళీధ‌ర్ రావు ఇన్‌చార్జీగా నియ‌మితుల‌య్యార‌ట‌. అంటే ఏ ఒక్క‌రికి తెలియ‌కుండానే ర‌చించిన న‌యా ప్లాన్‌ను బీజేపీ ఇప్ప‌టికే అమ‌ల్లో పెట్టేసింద‌న్న మాట‌. అంటే... బాబుకు వ‌చ్చే ఎన్నిక‌లు ఏమంత ఈజీ కాద‌న్న మాట‌.