Begin typing your search above and press return to search.

అడ్రస్ గల్లంతు కాకూడదంటే తప్పదు మరి..

By:  Tupaki Desk   |   6 May 2016 2:31 PM GMT
అడ్రస్ గల్లంతు కాకూడదంటే తప్పదు మరి..
X
రాజకీయాల్లో కాలానికి మించిన ప్రభావితమైన అంశం మరొకటి ఉండదు. తిరుగులేని రాజకీయ శక్తిగా చెలరేగిపోయే వారే.. కాలక్రమంలో అణాకాణికి కూడా పనికి రాని దుస్థితిలోకి జారుకుంటారు. ఈ వాస్తవం తెలిసిన నేతలంతా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే.. కాలం ఎంత చెడ్డదన్నది వారి అనుభవం వారికి ఎప్పుడూ పాఠాలు చెబుతుంది మరి. పదేళ్లు దేశాన్ని సింగిల్ హ్యాండ్ తో శాసించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు కాలం చేతికి చిక్కారు. తెలిసో.. తెలియకో ఆగస్టాలో కాస్త కక్కుర్తి పడిన కోణం ఇప్పుడు బయటకు రావటం.. దాంతో బంతాట ఆడుకోవాలని చూస్తున్న మోడీ పరివారం నుంచి తప్పించుకునేందుకు ఆమె చాలానే కసరత్తు చేస్తున్నారు. అయితే.. అదంత తేలిక కాదన్న విషయం ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

అందుకేనేమో.. ఎప్పుడో కానీ బయటకు రాని ఆమె నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీ వీధుల్లో నడవాల్సి వచ్చింది. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేయాల్సి వచ్చింది. ధర్నా చేసుకునేందుకు అనుమతి తీసుకోని అంశంలో ఆమెను పోలీసులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించాల్సి వచ్చింది. అయితే.. వెంటనే ఆమెను వదిలిపెట్టిన సంగతిని కాసేపు పక్కన పెడితే.. అలాంటి పరిస్థితిలోకి సోనియమ్మ చిక్కుకుపోవటం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడనిదిగా మారింది. అలా అని అమ్మ మీద అసహనం వ్యక్తం చేస్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

గాంధీ కుటుంబం మీద బతికేస్తున్న కాంగ్రెస్ పరివారం.. తప్పులెన్ని చేసినా సోనియానే తమకు సుప్రీం అని.. గాంధీ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉండటమే తమ ప్రధమ కర్తవ్యంగా ఫీల్ కావటం కొత్తేం కాదు. గాంధీ ఫ్యామిలీ లేని కాంగ్రెస్ ను వారు కలలో కూడా ఊహించలేరన్న చందంగానే తాజాగా సోనియాను వెనకేసుకొచ్చేందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మాత్రం తప్పు చేసినా పుట్టి మునిగిపోవటం ఖాయమన్న విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. సోనియమ్మకు దన్నుగా నిలవాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా జ్యోతిరాదిత్ సింధియా మాట్లాడుతూ.. సోనియమ్మను ఆడ సింహంగా పోల్చటం గమనార్హం. ఆగస్టా కుంభకోణంలో సోనియాగాంధీకి సంబంధం లేకున్నా.. ఆమె పేరును కావాలనే కమలనాథులు తెర మీదకు తెచ్చున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటలీ కోర్టు తీర్పులో సోనియా పేరు లేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల వాదనల్ని పక్కన పెడితే.. నిజంగానే ఆగస్టా కారణంగా ఏ మచ్చా పడే అవకాశం లేదంటే కాంగ్రెస్ అధినేత్రి అంత ఆగమాగం ఎందుకు అవుతున్నట్లు. అంతేకాదు.. సోనియమ్మను ఉన్నట్లుండి ఆడ సింహంగా పోలుస్తున్న తీరును చూస్తేనే పార్టీ ఎలాంటి పరిస్థితుల్లోఉందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.