Begin typing your search above and press return to search.

పెట్రోలూ పోస్తరంట.. పంచర్లూ యేస్తరా?

By:  Tupaki Desk   |   4 Oct 2015 10:30 PM GMT
పెట్రోలూ పోస్తరంట.. పంచర్లూ యేస్తరా?
X
'పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నాట్ట' వెనకటికి ఒక ప్రబుద్ధుడు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించాలని తహతహలాడిపోతున్న భారతీయజనతా పార్టీ అనుసరిస్తున్న వైఖరి అందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. గొంతెమ్మ కోరికల్లాగా.. గొంతెమ్మ హామీలు గుప్పిస్తున్న హామీలు గుప్పిస్తున్న భాజపా.. ఆచరణ గురించి.. జనం సందేహాలు లేవనెత్తుతూ ఉంటే.. అనుబంధ హామీలను కూడా ఇబ్బడి ముబ్బడిగా దంచి పారేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తమ ప్రత్యర్థి పార్టీ రాష్ట్రంలోని పదోతరగతి, ఇంటర్‌ చదివే బాలికల్లో ప్రతిభచూపిన వారికి సైకిళ్లు కానుకగా ఇస్తాం అని ప్రకటించిన దానికి పోటీగా భాజపా.. తాము స్కూటీలు ఇస్తాం... అని డాంబికంగా మేనిఫెస్టోలో పెట్టారు. కాకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా టాప్‌ ప్రతిభ కనబరచిన 5000 మంది బాలికలకు మాత్రమే ఇంటర్‌లో ఈ స్కూటీలు ఇవ్వడం జరుగుతందని క్లారిటీ ఇచ్చారు. అది బాగానే ఉంది. కాకపోతే ఉత్త స్కూటీల ఇస్తే వాటికి పెట్రోలు లాంటి ఆర్థిక భారం ఎలా? అనే ప్రశ్న జనంలో ఉత్పన్నం అవుతోంది. చర్చ జరుగుతోంది. ఈ వైనంపై.. 'స్కూటీలు సరే.. పెట్రోలు,ప్రమాద బీమా కూడా ఇస్తారా?' అనే శీర్షికతో తుపాకీ డాట్‌ కాం గతంలో ఓ కథనాన్ని కూడా అందించింది.

ప్రజల్లో జరుగుతున్న ఈ చర్చ పార్టీకి కాస్త కలవరం పుట్టించినట్లుంది. అందుకే తాజాగా స్కూటీలపై క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో 5000 మంది బాలికలకు స్కూటీలు ఇవ్వడం మాత్రమే కాదుట.. ఇంటర్‌ చదివే రెండేళ్లపాటూ వారికి అయ్యే పెట్రోలు ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇస్తుందిట. ఇలా ఓట్లు దండుకోవడానికి ఒకదానికి ఒకటి ముడిపెట్టుకుంటూ హామీలు దంచుకుంటూ పోతున్న భాజపా.. ముందు ముందు ''పంచర్లేస్తాం.. టైరులో ముల్లు దిగితే తీయిస్తాం..'' అంటూ ప్రచారం ప్రారంభించినా అతిశయోక్తి కాదని పలువురు జోకులేసుకుంటున్నారు.