Begin typing your search above and press return to search.

పార్టీని చీల్చి..ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   11 July 2018 1:48 PM GMT
పార్టీని చీల్చి..ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న బీజేపీ
X
జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదం - హింస పెరిగిపోయిందని - పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని పేర్కొంటూ పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసిన సంగ‌తి తెలిసిందే. పీడీపీతో కలిసి సాగడం ఇక బీజేపీ వల్ల కాదని - అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - జమ్ముకశ్మీర్ ఇన్‌ చార్జ్ రాంమాధవ్ వెల్లడించారు. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డంతో సీఎం ప‌ద‌వికి మెహ‌బూబా ముఫ్తీ రాజీనామా చేశారు.దీంతో గ‌వ‌ర్న‌ర్ పాల‌న సాగుతోంది. అయితే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ చ్చిన బీజేపీ...సొంతంగా త‌న స‌ర్కారు ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. జమ్ముకశ్మీర్‌ లో మరోసారి తమ నేతృత్వంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో నెల రోజుల్లోనే పీడీపీలోని రెబల్స్‌ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అంతేకాదు ఈసారి ఓ హిందువును సీఎంగా నియమించాలని భావిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీని చీల్చి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుకు చేసేందుకు బీజేపీ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌ లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది అవసరం. ఆ లెక్కన బీజేపీకి మరో 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి ఇద్దరి మద్దతు ఉంది. మరో 17 మంది ఎమ్మెల్యేలను పీడీపీ నుంచే లాగాలని బీజేపీ చూస్తున్నది. రానున్న రోజుల్లో అది సాధ్యమయ్యేలానే కనిపిస్తోంద‌ని అంటున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం - బీజేపీ సీనియర్ లీడర్ నిర్మల్ సింగ్.. ప్రధాని మోడీతో రహస్య సమావేశం నిర్వహించడం గమనార్హం. అంతకుముందే ఆయన జమ్ముకశ్మీర్ ఇన్‌ చార్జ్ రామ్‌ మాధవ్‌ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆగస్ట్‌లో అమర్‌ నాథ్ యాత్ర ముగియగానే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎవరూ పబ్లిగ్గా చెప్పడం లేదు. కొన్ని వారాలుగా శ్రీనగర్ - ఢిల్లీ మధ్య సీనియర్ నేతల రాకపోకలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు.

గత నెలలో పీడీపీకి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కొద్ది రోజులకే రాంమాధవ్.. పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జద్ లోన్‌ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత సజ్జద్ ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీతో మాట్లాడారు. జులై 4న హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ - భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ తో కలిసి శ్రీనగర్ వెళ్లారు. దీంతో అబిద్ అన్సారీ నేతృత్వంలోని పీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అబిద్ అన్సారీ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పడం గమనార్హం. ఈయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలకు మాజీ సీఎం మహబూబా ముఫ్తీతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సభ్యుల బలం ఉంటే కచ్చితంగా బీజేపీకి మద్దతిస్తామని అబిద్ అన్సారీ స్పష్టంచేశారు. మరోవైపు మహబూబా మాత్రం ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకున్నారు. బీజేపీ కాకుండా మరే ఇతర పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేదు. దీంతో పీడీపీ రెబల్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ఓ హిందూ సీఎంను నియమించడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.