Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరు...కోటి రూపాయ‌ల ఇస్తాం

By:  Tupaki Desk   |   23 Oct 2017 10:51 AM GMT
బీజేపీలో చేరు...కోటి రూపాయ‌ల ఇస్తాం
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజరాత్‌ లో ఎన్నికల వేడి జోరందుకుంది. మోడీ - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప‌ర్య‌ట‌న‌ల‌తో హోరెతిస్తున్నారు. మ‌రోవైపు బీజేపీపై సంచ‌ల‌న అవినీతి మ‌ర‌క ప‌డింది. పటేదార్ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్ నుంచి నెల రోజుల క్రితం విడిపోయి బీజేపీలో చేరిన నరేంద్ర పటేల్‌ కు ఆ పార్టీ కోటి రూపాయిలు లంచం ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పటేదార్ నాయకుడు నరేంద్ర పటేల్ వెల్ల‌డిస్తూ బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయ‌ల మొత్తం పది లక్షల రూపాయిలను అడ్వాన్సుగా చెల్లించిందని..దీనిపై నరేంద్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోటి రూపాయిలు కాదు, రిజర్వ్‌ బ్యాంక్‌ లో ఉన్న సొమ్మంతా తెచ్చి ఇచ్చినా తాను అమ్ముడుపోనని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

బీజేపీ చేరిన మరొక పటేదార్ నాయకుడు వరుణ్‌ పటేల్‌ తనను గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితుభాయ్‌ వాఘాని వద్దకు తీసుకు వెళ్లారని నరేంద్ర చెప్పారు. కమలం కార్యాలయంలోకి తనను తీసుకుని వెళ్లి జితుభాయ్‌ కు - మరికొంతమంది మంత్రులకు పరిచయం చేశాడని, తరువాత తనను పక్క గదిలోకి తీసుకుని వెళ్లి పది లక్షల రూపాయిల నగదు ఉన్న బ్యాగ్‌ ను ఇచ్చారని నరేంద్ర చెప్పారు. మిగిలిన 90 లక్షలు సోమవారం (నేడు) ఇస్తామన్నారని ఆయన అన్నారు. సోమవారం జరిగే కార్యక్రమానికి తాను హాజరు కావాలని అడిగారని, అప్పుడు మిగిలిన 90 లక్షలు ఇస్తామన్నారని ఆయన అన్నారు. ఇదేం విధాన‌మ‌ని న‌రేంద్ర ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవలే ఆ పార్టీలో చేరిన పాటిదార్‌ నాయకుడు నిఖిల్‌ సవాని చెప్పారు. పటేదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ కు అత్యంత సన్నిహితుడైన నిఖిల్‌ కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. బీజేపీ పాటిదార్‌ నాయకులకు లంచాలు ఇవ్వజూపుతోందని నిఖిల్‌ ఆరోపించారు. బీజేపీ హామీలకే పరిమితమవుతోందని, ఆచరణలో మాత్రం శూన్యమేనని ఆయన అన్నారు. మరొక పటేదార్ నాయకుడు నరేంద్ర పటేల్‌ కు బిజెపి కోటి రూపాయిలు లంచం ఇవ్వజూపినట్లు విన్నానని ఆయన అన్నారు. ఆ లంచాన్ని తిరస్కరించినందుకు నరేంద్రను అభినందిస్తున్నానని నిఖిల్‌ చెప్పారు.